రాయలసీమ : జగన్ టాప్ గేర్లోకి వెళ్ళిపోయారా ?
జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా టాప్ గేర్లోకి వెళ్ళిపోయినట్లే ఉన్నారు. రెండు రోజుల్లో రెండు సభల్లో జగన్ మాట్లాడిన విధానం చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల సభలో జగన్ మాట్లాడుతు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తన వెంట్రుక కూడా పీకలేవన్నారు. గురువారం నరసరావుపేట సభలో మాట్లాడుతు ప్రతిపక్షాలకు, ఎల్లోమీడియాకు బాక్సు బద్ధలైపోతుందంటు వార్నింగిచ్చారు.
నిజానికి పై విధంగా మాట్లాడటం జగన్ నైజంకాదు. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడిందిలేదు. అసలు మీడియాతో మాట్లాడేదే చాలా తక్కువ. ఎక్కడైనా సభల్లో మాట్లాడినా ఏ ఉద్దేశ్యంతో సభ నిర్వహించారో దానివరకే పరిమితమయ్యేవారు. మహాఅయితే ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా అంటు సంబోధించేవారంతే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడేటపుడు మాత్రం దత్తపత్రుడంటు ఎద్దేవాచేసేవారు.ఇదే సమయంలో చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా ప్రతిరోజు జగన్ పై నోటికొచ్చింది మాట్లాడుతునే ఉన్నారు, బుర్రకు తోచింది అచ్చేస్తునే ఉన్నారు.
నంద్యాల సభలో మాట్లాడుతు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలగురించి వివరించారు. అలా వివరిస్తునే దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నంత వరకు చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా తన వెంట్రుక కూడా పీకలేరంటు ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇపుడీ విషయమే అన్నీచోట్లా చర్చనీయాంశంగా మారింది. తన సహజశైలికి భిన్నంగా జగన్ మాట్లాడటం ఆశ్చర్యంగానే ఉంది. చూడబోతే పార్టీ నేతలను, శ్రేణులను ఉత్తేజపరచటానికే మాట్లాడినట్లు అనిపిస్తోంది,
జగన్ దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో మరింత స్పీడు పెంచబోతున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే జగన్ ఏమిచేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా ఉంది ఎల్లోమీడియా వ్యవహారం. ఎక్కడో శ్రీలంకలో సంక్షోభానికి ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ముడేసి సంక్షోభంలో ఏపీ అంటు రాసేస్తోంది ఎల్లోమీడియా. చూడబోతే భవిష్యత్తులో చంద్రబాబు, పవన్ , ఎల్లోమీడియా విషయంలో జగన్ మరింత దూకుడుగా వెళ్ళబోతున్నట్లే అనిపిస్తోంది. మూడేళ్ళుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారానికి జగన్ గట్టిగా సమాధానాలు ఇవ్వాలని అనుకున్నట్లున్నారు. అందుకనే ఒక్కసారిగా టాప్ గేర్లోకి వెళ్ళిపోయారు.