మాజీ మంత్రి అనిల్ ని ఒంటరి చేయబోతున్నారా..?
అక్కడే అసలు ట్విస్ట్..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాను.. బాల్య స్నేహితులమంటూ పేర్కొన్నారు మంత్రి కాకాణి. తామిద్దరం ఒకే నెలలో పుట్టామని, అయితే.. తానే ముందు పుట్టానని చెప్పారు మంత్రి కాకాణి. వయసు రీత్యా శ్రీధర్ రెడ్డికంటే తాను కాస్త పెద్దవాడిని అయినా.. రాజకీయాల్లో మాత్రం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ముందు ఎంట్రీ ఇచ్చారని, ఆయన తనకంటే సీనియర్ అన్నారు కాకాణి. అసలు సీఎం జగన్‌కి తనను పరిచయం చేసింది కూడా శ్రీధర్ రెడ్డే అని గుర్తు చేసుకున్నారు. తామిద్దరం సమ ఉజ్జీలమని చెప్పారు కాకాణి. వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలే కావాలంటూ పరోక్షంగా మాజీ మంత్రి అనిల్ కి చురకలంటించారు.
అనిల్ వెంట ఎవరు..?
నెల్లూరు జిల్లాలో కాకాణి తప్ప మిగతా వారంతా తనతోపాటే ఉన్నారని అనుకున్నారు అనిల్. ఈ క్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అనిల్ పక్కన ఉంటారనుకున్నారు. ఆయన కూడా మెల్లగా కాకాణి వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కాకాణి వర్గంలో చేరిపోయారు. తనకు ఇద్దరూ ముఖ్యమేనని చెబుతున్నా.. కాకాణి మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకే శ్రీధర్ రెడ్డి ప్రయారిటీ ఇస్తారనేది చెప్పక తప్పదు. సో.. ఎలా చూసుకున్నా అనిల్ ఇక్కడ ఒంటరి అవుతున్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఒంటరిని చేస్తోంది వైరివర్గం అని చెప్పక తప్పదు. ముందు అనిల్ కాస్త దూకుడుగా ఉన్నా... ఇప్పుడు తన వెంట ఎవరూ లేరని తెలుసుకున్న తర్వాతయినా స్వరం తగ్గిస్తారా..? లేక అదే స్పీడ్ కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.