అమరావతి : ఇద్దరికీ క్లాసు తప్పలేదా ?
ఇద్దరికి ఇద్దరూ గట్టి లీడర్లే. ఇద్దరూ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ సపోర్టర్లే. ఇద్దరికీ తమ నియోజకవర్గాల్లో మంచి పట్టేవుంది. ఇద్దరు కూడా పార్టీకి చాలా లాయల్ సపోర్టర్లనే చెప్పాలి. జగన్ గీసిన గీటు దాటరు. అయితే ఈ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఏమాత్రం పడదు. వాళ్ళే నెల్లూరు జిల్లాలోని మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, తాజామాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్. మొదటినుండి ఉన్న విబేధాలే ఇపుడు ఎక్కువైపోయాయి.
అందుకనే జగన్ ఇద్దరినీ పిలిచి క్లాసు పీకినట్లు సమాచారం. వారంరోజులుగా వీళ్ళమధ్య వివాదాలపై రకరకాల వార్తలు, కథనాలు వినిపిస్తునే ఉన్నాయి. వీటికి ఒకరకంగా వీళ్ళద్దరే అవకాశం ఇచ్చారు. మంత్రయిన తర్వాత మొదటిసారి జిల్లాకు కాకాణి వచ్చిన రోజే అనీల్ కూడా నెల్లూరులోని క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద సభ నిర్వహించారు. దీంతో ఇద్దరి మద్య ఉన్న విబేధాలు బహిర్గతమయ్యాయి. అనీల్ సభను వాయిదా వేయించేట్లుగా సీనియర్ మంత్రి ఒకరు చేసిన ప్రయత్నం కూడా ఫెయిలైంది.
దాంతో విషయం జగన్మోహన్ రెడ్డికి చేరింది. వీళ్ళ వివాదాన్ని మొగ్గలోనే తుంచేయకపోతే ముందు ముందు చాలా కష్టమవుతుందనే జగన్ ఇద్దరితో భేటీ అయ్యారు. ముందు అనీల్ తో భేటీ అయి విషయం విన్నారు. తర్వాత కాకాణితో కూడా సమావేశమయ్యారు. మంత్రి చెప్పింది కూడా విన్నతర్వాత జగన్ ఇద్దరినీ కూర్చోబెట్టి తనదైన స్టైల్లో ఇద్దరికీ ఒకేసారి చెప్పాల్సింది చెప్పి క్లాసు పీకినట్లు సమాచారం.
గతంలో ఇలాంటి క్లాసే కాకాణికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా పడింది. అవసరమైతే తనకు ఎంతటి సన్నిహితులనేది కూడా చూడకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటానని ఇచ్చిన వార్నింగ్ అప్పట్లో బాగానే పనిచేసింది. జగన్ వార్నింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు నోరిప్పలేదు. అలాంటిది ఇంతకాలం తర్వాత కాకాణి-అనీల్ మధ్య పంచాయితీ మొదలైంది. ఇప్పుడు గనుక మొగ్గలోనే తుంచేయకపోతే ఇది మరోజిల్లాకు కూడా పాకే ప్రమాదముంది. అందుకనే ఇద్దరినీ పిలిచి క్లాసు పీకారట. మరి ఇపుడిచ్చిన డోసు ఎంతకాలం పనిచేస్తుందో చూడాలి.