జగన్ - పేర్ని నాని మధ్య దూరం పెరుగుతోందా..?

Deekshitha Reddy
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా పేర్ని నానికి రెండోసారి పదవి దక్కలేదు. ఆ తర్వాత ఆయన మీడియా ముందు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఆమధ్య జిల్లాల బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీ పటిష్టతకోసం కృషిచేస్తాను, తాను అధ్యక్షుడిగా ఉన్న జిల్లాలో అన్ని స్థానాలు వైసీపీకే అని చెప్పారు నాని. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే.. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆయన ఇంకా బాధలో ఉన్నట్టే తెలుస్తోంది.

తాజాగా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ అధికారిక కార్యక్రమంలో మిగతా నేతలతో కలవకుండా కాస్త దూరంగానే పేర్ని నాని ఉండిపోయారని తెలుస్తోంది. గిలకలదిండి హార్బర్‌ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్‌ మచిలీపట్నంకు వచ్చారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని కూడా ఆ కార్యక్రమానికి హాజరైనా ఆయన కాస్త దూరంగానే ఉన్నారు. మంత్రి అప్పలరాజు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం విశేషం. పేర్ని నానిని అప్పలరాజు చేయి పట్టుకుని అక్కడి పనులు పరిశీలించేందుకు తీసుకెళ్లాలని చూశారు. కానీ నాని మాత్రం దూరంగానే ఉండిపోయారు. కేంద్ర మంత్రితో అప్పలరాజు చర్చించే సమయంలో కూడా ఆయన దూరంగానే ఉండి చూస్తున్నారు.

ఆ తర్వాత సముద్ర మొగ పరిశీలనకు ఇద్దరు మంత్రులు ఇతర అధికారులతో కలసి పడవలో వెళ్లారు. కానీ ఆ పడవ ఎక్కేందుకు నాని నిరాకరించారు. ఒడ్డునే ఉండిపోయారు. దీంతో అసలు నాని ఎందుకిలా ప్రవర్తిస్తున్నారనే విషయం అక్కడ చర్చనీయాంశమైంది. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత చాలామంది నేతలు ఇలాగే అసంతృప్తితో ఉన్నా అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా బయటపడటంలేదు. కానీ పేర్ని నాని మాత్రం కేంద్ర మంత్రి వచ్చిన కార్యక్రమంలోనే ఇలా అలిగినట్టు కనిపించారు. అయితే ఆయన నిజంగానే అలిగారా, మంత్రి పదవి పోయిందన్న విషయంలో ఇంకా జగన్ పై కోపంతోనే ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తమ్మీద కేంద్ర మంత్రి పర్యటనలో పేర్ని నాని ముభావంగా ఉండటం అక్కడున్న ఆయన అభిమానుల్ని తీవ్రంగా కలచి వేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: