అమరావతి : చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేశారా ?
వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు టార్గెట్లు సెట్ చేసినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఈ టార్గెట్ దేనికంటే టీడీపీ గెలవాల్సిన సీట్ల విషయంలో కాదట. వైసీపీలో ఓడించాల్సిన వాళ్ళ విషయంలో పెద్ద టార్గెట్టే పెట్టుకున్నట్లు సమాచారం. టార్గెట్ సెట్ చేసే విషయంలో సీనియర్లకు బాధ్యతలు వదిలేయకుండా తానే వ్యక్తిగతంగా చూస్తున్నారట. ఇపుడు మొదలవ్వబోతున్న జిల్లాల టూర్లు కూడా ఇందులో భాగమే అంటున్నారు.
ఎప్పుడో మహానాడు తర్వాత మొదలవ్వాల్సిన జిల్లాల టూర్లను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హఠాత్తుగా బుధవారం నుండే మొదలుపెట్టేస్తున్నారు. అదికూడా శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంతో టూర్ మొదలవ్వబోతోంది. ఓడించాల్సిన వైసీపీ నేతల జాబితా బాగా పెద్దదిగా ఉండబట్టే అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబే కసరత్తుచేసి టార్గెట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈయన ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఆయనపై పెద్దగా నెగిటివ్ లేదుకానీ ఈయన కూడా టార్గెట్ లోనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబంటేనే తమ్మినేని మండిపడుతుంటారు కాబట్టి. అలాగే తర్వాత రోజు భీమిలీలో పర్యటించబోతున్నారు. ఇక్కడినుండి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవంతి కూడా చంద్రబాబంటే అంతెత్తున లేస్తుంటారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు టార్గెట్లలో ఉన్నవారు కొడాలినాని, ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, కన్నబాబు, అమర్ నాధ్, రోజా, పెద్దిరెడ్డి సోదరులు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, నారాయణస్వామి, పేర్నినాని, జోగి రమేష్, బొత్సా సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ కాకుండా మరో పదిమంది అంటే మొత్తం 27 మంది ఉన్నారట. వీళ్ళ గెలుపును కచ్చితంగా అడ్డుకోవాల్సిందే అనే ప్లాన్ తో ఉన్నారట. అందుకనే వీళ్ళకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో వీళ్ళ ఓటమికి ప్రత్యేకించి బృందాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారట. ఒకపుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు టార్గెట్లో ఉన్నారు కానీ మరిప్పుడు ఉన్నారో లేదో తెలీదు.