అన్నీ సిద్ధం చేయండి.. రైతుకు కష్టం రావొద్దు..!

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ వ్యవసాయ శాఖ పై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా తోటబడి కార్యక్రమంలో మామిడి, అరటిపై కరదీపిక విడుదల చేశారు. బ్యాంబు ట్రీ అంటే వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. ఖరీఫ్ సమీపిస్తోన్న దృష్ట్యా సన్నద్దతపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం జగన్ అధికారులను నిర్దేశించారు.


ఈ మేరకు అన్నీ అందుబాటులోనే ఉన్నాయన్న అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు జిల్లా స్దాయి నుంచి ఆర్బీకే స్ధాయి వరకు సిద్దం చేసుకున్నామని అధికారులు వివరించారు. సాగునీటికి ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా సకాలంలో నీళ్లు విడుదల చేసే అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కౌలు రైతులకు అండగా ఉండాలన్న సీఎం.. సీసీఆర్సీ వల్ల  కౌలు రైతులకు  మేలు జరుగుతుందని అన్నారు.


సీసీఆర్సీ పెంచడంవల్ల కౌలు రైతులకు అన్నిరకాలుగా ప్రభుత్వ సహాయం అందుతుందని సీఎం జగన్ అన్నారు. వీలైతే ప్రతి ఇంటికీ వెళ్లి సీసీఆర్సీపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ కోరారు. సీసీఆర్సీ వల్ల రైతు హక్కుకు ఎలాంటి భంగం కలగదని, దీనిపై పూర్తిస్థాయి సమాచారాన్ని వారికి వివరించాలని సీఎం జగన్ తెలిపారు. అన్ని వివరాలతో ముఖ్యమంత్రిగా నా తరఫు నుంచి ఒక లేఖ పంపించాలని సీఎం జగన్ ఆదేశించారు.


అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ప్రకృతి, సహజ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో దీనికోసం సీహెచ్‌సీ ఉండాలని తెలిపారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కచ్చితంగా రైతులకు అందాలని సీఎం జగన్ అన్నారు.  అన్ని ఆర్బీకేల్లో వీటికోసం స్టోరేజీ రూమ్స్‌ను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు వ్యక్తిగతంగా  సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించేదుకు డిమాండ్ సర్వే నిర్వహించాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: