ఆ విషయంలో జగన్ చేతులెత్తేసినట్టేనా..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ కు సీఎం జగన్ ఈమేరకు ఓ లేఖ రాశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏపీలో సన్ ఫ్లవర్ ఆయిల్ కొరత ఏర్పడిందని ఆయన వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యం మనకు ఉంది. మిగతా 60శాతాన్ని మనం ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దిగుమతుల విషయానికొస్తే.. ఇండోనేషియా, మలేషియా నుంచి మనకు 95 శాతం పామాయిల్ దిగుమతి అవుతోంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నాం. ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో సన్ ఫ్లవర్ ఆయిల్ కొరత ఏర్పడింది. దీంతో సప్లై తక్కువ కావడంతో రేట్లు భారీగా పెరిగిపోయాయి.
ఏపీలో మూడింట రెండొంతులు ప్రజలు వంట నూనెగా సన్ ఫ్లవర్ ఆయిల్ నే వాడతారు. వంటనూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా వైసీపీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. విజిలెన్స్ అధికారులు, పౌర సరఫరాలు, తూనికలు కొలతలు శాఖ అధికారులతో ఎక్కడికక్కడ అక్రమ నిల్వలను కనుగొనేందుకు తనిఖీలు చేయిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఇక నిల్వలు నిండుకుంటున్నాయన్న దశలో కేంద్రం ప్రత్యేకంగా సన్ ఫ్లవర్ ఆయిల్ కేటాయించాలని కోరారు సీఎం జగన్.