భారత ఆర్మీలో కాంట్రాక్ట్ ఉద్యోగులా..? నిజమెంత..?
భారత ప్రభుత్వం త్రివిధ దళాల కోసం ఈ ఏడాది బడ్జెట్ లో 5.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో నాలుగో వంతు పెన్షన్ల కోసం పక్కనపెట్టాల్సిన పరిస్థితి. అయితే పెన్షన్ల తకరారు లేకుండా ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. పెన్షన్లు, ప్రమోషన్లు లేని ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ) అనే పేరుతో ఈ పథకాన్ని పట్టాలెక్కించబోతోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా కాంట్రాక్టు పద్దతిలో భారత ప్రభుత్వం సైనికులను నియమించుకుంటుంది.
18 నుంచి 21 ఏళ్ల వయసు లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతిలో వీరిని భారత సైన్యంలో చేర్చుకుంటారు. సాధారణ సైనికులకు ఇచ్చేలాగానే వీరికి కూడా జీతం ఇస్తారు. కానీ సర్వీసు మాత్రం నాలుగేళ్లు. అందులో మొదటి 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఈ పథకం ద్వారా చేరిన వారిలో నాలుగోవంతు మందిని మాత్రమే ఆ తర్వాత పర్మినెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే నూటికి 75మంది నాలుగేళ్ల తర్వాత స్వచ్ఛందంగా ఆ ఉద్యోగాలనుంచి బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నిర్ణయంపై భారత సైన్యంలోని కీలక అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. భారత సైన్యంలో సాధారణ సైనికుడికి నాలుగేళ్ల పాటు శిక్షణ ఉంటుందని, ఆ తర్వాత ఆయా యూనిట్లలో చేరిన తర్వాత మరలా ట్రైనింగ్ ఇస్తుంటారని, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కేవలం 6 నెలల శిక్షణతో ఎలా పూర్తి స్థాయిలో సన్నద్ధులు అవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకానికి స్వస్తి పలకాలని చెబుతున్నారు.