జనసేనకోసం కలసికట్టుగా మెగా ఫ్యామిలీ..

Deekshitha Reddy
సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఆపదలో ఉంటే మెగా ఫ్యామిలీ తామున్నామంటూ ముందుకొస్తుంది. ఇప్పుడు సామాన్య ప్రజలు, రైతులకు కూడా మెగా ఫ్యామిలీ అండగా నిలబడాలనుకుంటోంది. ఈమేరకు జనసేన తరపున ఆర్థిక సాయం చేసేందుకు మెగా ఫ్యామిలీ ముందుకొచ్చింది. జనసేన మొదలు పెట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి మెగా ఫ్యామిలీ 35 లక్షల రూపాయల విరాళం అందించింది.

జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రకు, కౌలు రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయానికి.. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆర్ధిక చేయూతను అందిస్తున్నారు. జనసేన కౌలు రైతుల కుటుంబాల ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు మెగా ఫ్యామిలీ విరాళంగా అందించింది. ఈమేరకు వారంతా పవన్ కల్యాణ్ ని కలసి ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు.

తామెప్పుడూ ఇంట్లో రాజకీయాల గురించి మాట్లాడుకోమని, కానీ తమ కుటుంబ సభ్యులు ఇలా ముందుకొచ్చి తన పార్టీ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రకు అండగా ఉంటామని చెప్పడం సంతోషకరం అని అన్నారు. ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయం అని చెప్పారు. కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో  తాను మంచి స్థానానికి వెళ్లాలని వారు కోరుకుంటారే కానీ, ఇలా ఎప్పుడూ ముందుకు రాలేదని, ఇప్పుడు తొలిసారిగా ఇలా వారంతా తనకోసం ముందుకు రావడం ఆనందం కలిగిస్తోందని చెప్పారు.

జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాల దీనస్థితి అందరికీ తెలిసొచ్చింది. వారి పరిస్థితి, ఆర్థిక అవస్థలను చూసి మెగా ఫ్యామిలీ చలించిపోయింది. అనాథలుగా మారిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తుకోసం సాయం అందించింది.

ఎవరెవరు ఎంతెంత సాయం..?
వరుణ్ తేజ్ -  రూ.10 లక్షలు
సాయిధరమ్ తేజ్ - రూ.10 లక్షలు
వైష్ణవ్ తేజ్ - రూ.5 లక్షలు
నిహారిక - రూ.5 లక్షలు ఇలా వీరంతా విరాళాలు ఇచ్చారు.
అంతే కాదు.. హీరో సాయిధరమ్ తేజ్ ఇప్పటికే అనాథ వృద్ధులకోసం ఓ ఆశ్రమాన్ని కూడా నడుపుతున్నాడు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా స్వచ్చంద సంస్థలకు తమకు తోచిన సాయం అందిస్తుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వీరంతా ఇప్పుడు కౌలు రైతులకోసం ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: