ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కొడాలి నాని విమర్శలు..
గుడివాడ అభివృద్ది పనులను అడ్డుకునే ప్రయత్నాలను పురందీశ్వరి విరమించుకోవాలని సూచించారు నాని. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కూడా ఆయన హెచ్చరించారు. గుడివాడలో ప్రజలు రైల్వే గేట్ల వల్ల ప్రయాణం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారని, వారి కష్టాలు తీరాలంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లు అవసరమని అన్నారు. గతంలో ఎంపీ బాలశౌరి ఈ బ్రిడ్జ్ ల కోసం లోక్ సభలో ప్రశ్నించారని, సీఎం జగన్ కూడా పలుమార్లు వీటి గురించి ప్రస్తావించారని చెప్పారు. అయితే ఇన్నాళ్లకు ఫ్లైఓవర్లు శాంక్షన్ అయితే వాటిని అడ్డుకోవాలని చూడటం దారుణం అని అన్నారు నాని.
ఈ నెల 26న గుడివాడ ఫ్లైఓవర్లకోసం టెండర్లు పిలవాల్సి ఉందని, అయితే పురందీశ్వరి అడ్డుకోవడం వల్ల కేంద్రం వెనకడుగు వేస్తోందని నాని ఆరోపించారు. ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రారంభమైతే అక్కడ ఉన్న షాపులు, పెట్రోల్ బంకుల వారికి ఇబ్బందిగా మారుతుందని పురందీశ్వరి అంటున్నారని, ఆమె రాసిన లేఖ వల్లే ఫ్లైఓవర్ల నిర్మాణం ఆగిపోయిందని అంటున్నారు. ఎన్టీఆర్ కుమార్తె అయిన ఆమె ప్రజలందరి బాగు కోసం ఆలోచించాలని, గుడివాడ ప్రజల తరపున ఆలోచించాలని, అలాంటిది ఆమె కేవలం 10మంది వ్యాపారులకోసం ఆలోచిస్తున్నారని, ఇది సరికాదని చెప్పారు నాని. ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం తాను పోరాటం చేస్తానని, అవసరమైతే అక్కడే టెంట్ వేసుకుని ఆందోళన చేస్తానన్నారు. పురందీశ్వరితో కొంతమంది స్థానిక టీడీపీ నేతలు కూడా చేతులు కలిపారని, అందరూ కలసి గుడివాడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు నాని.