వైసీపీ మంత్రిపై ఫైర్ అవుతున్న జనసైనికులు..
ఇంతకీ అమర్ నాథ్ ఏమన్నారు..?
మంత్రి అమర్ నాథ్.. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ ని చాలాసార్లు టార్గెట్ చేశారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ పై మరోసారి సెటైర్లు పేల్చారు. పవన్ కి ఏవైనా మూడు కావాలని, అందుకే ఆయన మూడు ఆప్షన్లు ఇచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పరోక్షంగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినట్టు అమర్ నాథ్ మాట్లాడరు. అంతే కాదు.. టీడీపీ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ వాళ్ళు తమకు ఎవరైనా ప్రేమికులు దొరుకుతారేమో అని రాష్ట్రంలో తిరుగుతున్నారని అన్నారు అమర్ నాథ్. అందుకే అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేతలు రెండు రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. 74 ఏళ్ల చంద్రబాబు.. తనకు తానే తనది వన్ సైడ్ లవ్వు అని చెప్పుకోవడంపై ఆయన చెణుకులు విసిరారు. చంద్రబాబు తనను ఎవరూ ప్రేమించడం లేదని బాధ పడుతున్నారని, ఆయనను ప్రేమించే వారు ఎవరూ దొరకడంలేదని అన్నారు. టీడీపీ ముసలి పార్టీ అని, చంద్రబాబు ముసలి నాయకుడని, ఇంకా వారికి ప్రేమికులు ఎక్కడ దొరుకుతారని పంచ్ డైలాగులు వేశారు.
జనసేన రియాక్షన్..
పవన్ కి ఏవైనా మూడు కావాలంటూ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పొత్తులపై పవన్ కల్యాణ్ ఇటీవల మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఆ ఆప్షన్ల గురించి చెప్పినట్టు అమర్ నాథ్ వ్యాఖ్యలు ఉన్నా కూడా.. పవన్ వ్యక్తిగత జీవితాన్ని అమర్ నాథ్ టార్గెట్ చేశారని అంటున్నారు జనసైనికులు. ఇలా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం సరికాదని అంటున్నారు జనసైనికులు. సోషల్ మీడియాలో అమర్ నాథ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అమర్ నాథ్ ని జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు.