అమరావతి : ఈ విషయంలో జగన్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి
నిజంగా జగన్మోహన్ రెడ్డిని చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. తెలంగాణాలో జరిగిన ఘటన గనుక ఏపీలో ఎక్కడైనా జరిగుంటే అంతే సంగతులు. కేంద్రం తాజాగా ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ప్రకటించిన అగ్నిపథ్ పథకం ప్రకంపనలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భయంకరంగా కనిపించాయి. కేంద్ర పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పైన దాడులు చేసి తగలబెట్టేశారు.
రైలుబోగీలను తగల బెట్టేసిన ఆందోళనకారులు స్టేషన్లోనే ఉన్న కార్గో గదిలో ఉన్న మోటారు సైకిళ్ళతో పాటు ఇతర పార్శిళ్ళను కూడా తగలబెట్టేశారు. రైళ్ళలోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసంచేసేశారు. దాదాపు నాలుగుగంటలపాటు రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు పెద్ద విధ్వంసాన్నే సృష్టించారు. వేరేదారిలేక చివరకు పోలీసులు కాల్పులకు దిగాల్సొచ్చింది. ఈ కాల్పుల్లో ఒక యువకుడు చనిపోగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి.
సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇదే ఘటన ఏపీలో ఎక్కడైనా జరిగుంటే ఈపాటికి మీడియా యావత్తు జగన్ను పట్టుకుని గబ్బుపట్టించేసుండేదనటంలో సందేహంలేదు. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతు నానా రచ్చ మొదలుపెట్టేసుండేవి. జగన్ రాజీనామా కోరుతు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా డిబేట్ల మీద డిబేట్లు నిర్వహించి మామూలు జనాలను బాగా రెచ్చగొట్టేపనిలో ఉండేవి. ఇపుడు జరిగిన ఘటన తెలంగాణాలో కాబట్టి ఎల్లోమీడియా నోరుమూసుకుని కూర్చుంది.
ఘటనను ఘటనగా మాత్రమే హైలైట్ చేస్తున్నది. ఎందుకేంట పొరబాటున కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కమాట చెబితే ఏమవుతుందో ఎల్లోమీడియాకు బాగా తెలుసు. అందుకనే అన్నీ మూసుకుని కూర్చుంది. ఇక చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో అయితే అసలు నోరేవిప్పటంలేదు. ఏపీలో ఏమూల ఏమి జరిగినా దానికి జగన్ కు ముడేసేసి రాజీనామాలు కోరే అబ్బా, కొడుకులు అసలు సికింద్రాబాద్ ఘటనపైన నోరేఎత్తలేదు.
కేంద్రపథకాన్ని తప్పుపట్టలేరు, ఆందోళనకారులను సమర్ధించలేరు అందుకనే అసలు ఘటన జరిగిందని తెలియనట్లే నటిస్తున్నారు. చివరగా జనసేన అధినేత వపన్ కల్యాణ్ కూడా చాలా సింపుల్ గా ఘటనను ఖండించారే కానీ ఒక్కమాట కూడా ఎక్కువతక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే కేసీయార్ అంటే భయం ఆ స్ధాయిలో ఉంది. అదే ఏపీలో జరిగుంటే జగన్ పై విరుచుకుపిపోయుండేవారే. సో ఇదంతా చూసిన తర్వాత జనాలు జగన్ చాలా అదృష్టవంతుడనే అనుకుంటున్నారు.