అమర్ నాథ్ లో గల్లంతైన 34మంది ఏపీ వాసులు...

Deekshitha Reddy
వరదల కారణంగా అమర్ నాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 14మంది వరదల కారణంగా మృతి చెందారు. మిగతావారిలో చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడినుంచి వారిని సొంత స్థలాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏపీనుంచి ఎంతమంది వెళ్లారు, వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా బయటపడుతున్నారనేది ఆందోళనకరంగా మారింది. ఇంకా అమర్ నాథ్ లో ఆచూకీ తెలియకుండా 34మంది ఏపీ వాసులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో 29మంది నెల్లూరుకి చెందినవారే కావడం విశేషం.

ఇక ఏపీనుంచి వెళ్లినవారిలో కొంతమంది అధికారుల సాయంతో తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్లో 20 మంది ఆదివారం విజయవాడకు సురక్షితంగా చేరుకున్నారు. విజయవాడ నుంచి వారిని సొంత ప్రాంతాలకు పంపించారు అధికారులు. మరో 18 మంది యాత్రికులు ఈరోజు చండీగఢ్ నుంచి బయలుదేరుతారు. వీరంతా చండీగఢ్ నుంచి రైలులో విజయవాడకు వస్తారు. ఈమేరకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏపీ యాత్రికుల్ని క్షేమంగా సొంత రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్.

అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్లిన ఎన్టీఆర్‌ జిల్లా వాసులు తిరుగు ప్రయాణంలో క్షేమంగా వచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి మొత్తం 35 మందితో కూడిన ఓ బృందం అమర్‌ నాథ్‌ యాత్రకు బయలుదేరి వెళ్లింది. జూన్ 27న వీరంతా విజయవాడ నుంచి రైలులో బయలుదేరి వెళ్లారు. అయితే నేరుగా అమర్ నాథ్ యాత్ర కాకుండా మార్గమధ్యంలో ఇతర క్షేత్రాలను కూడా దర్శించుకున్నారు. ఆ క్షేత్రాల సందర్శన పూర్తయిన తర్వాత ఈ నెల 8న సాయంత్రం మూడున్నర గంటలకు వీరంతా అమర్ నాథ్ లోని మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. సాయంత్రం ఐదున్నర గంటలకు వరద ముంచెత్తింది. అయితే వీరంతా ఆ వరదనుంచి సురక్షితంగాబయటపడ్డారు. వారిని శ్రీనగర్ కి తరలించి అక్కడినుంచి జమ్మూ, చండీగఢ్ కి చేర్చారు. చండీగఢ్ నుంచి విజయవాడకు రైలులో తరలించారు.

ప్రస్తుతం 34మంది ఆచూకీ తెలియలేదని అంటున్నారు అధికారులు. అయితే వీరంతా సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, చార్జింగ్ లేకపోవడం వల్ల ఫోన్ టచ్ లోకి రాలేకపోతున్నారి అనుమానిస్తున్నారు. ఎక్కడో ఓ చోట వీరంతా క్షేమంగా ఉంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: