అమరావతి : కుప్పం జగన్ సొంతమైపోయినట్లేనా ?

Vijaya





‘కుప్పం నా సొంతనియోజకవర్గంతో సమానం’  ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించి వైసీపీ జెండాను ఎగరేయాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికి చాలాసార్లే చెప్పారు. చెప్పటమే కాదు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమపథకాలను పక్కాగా అమలుచేయిస్తున్నారు. దానికితగ్గట్లే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఎల్సీ భరత్ కూడా బాగా కష్టపడుతున్నారు.




వచ్చే ఎన్నికలను దృష్టిపెట్టుకుని 175 నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీకి జగన్ గురువారం శ్రీకారంచుట్టారు. ఈ కార్యక్రమాన్ని మొదట కుప్పం నియోజకవర్గంతోనే మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండాను ఎగరేయటంలో భరత్ కు అందరు మద్దతుగా నిలవాలన్నారు. చంద్రబాబు హయాంలో జరగని అభివృద్ధిని మూడేళ్ళల్లో చేసిచూపించినట్లు చెప్పారు. ఎంఎల్ఏగా భరత్ ను గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ కూడా ఇచ్చారు. అంటే కుప్పంలో భరత్ గెలిచినట్లుగానే జగన్ భావిస్తున్నట్లున్నారు.



భరత్ ను ఎంఎల్సీగా మాత్రమే చూడాలని అనుకుంటున్నారా లేకపోతే మరో మెట్టెక్కించి ఎంఎల్ఏగా గెలిపించి మంత్రిగా చూడాలని అనుకుంటున్నారా డిసైడ్ చేసుకోమని స్పష్టంగా చెప్పారు. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్తులతో పాటు మున్సిపల్ ఛైర్మన్ కూడా గెలుచుకున్నపార్టీకి ఎంఎల్ఏ గెలవటం పెద్ద కష్టంకాదన్నారు. కాకపోతే పార్టీ గెలుపుకు అందరు మనసుపెట్టాలన్నారు. కుప్పం తన సొంతనియోజకవర్గం లాంటిదన్నారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే టీడీపీకి దెబ్బపడుతుందన్నారు.



వచ్చే ఎన్నికల్లో అందరు సమిష్టిగా కష్టపడితే పార్టీ గెలవటం ఖాయమన్న నమ్మకం తనకుందన్నారు. టీడీపీకి కుప్పం కంచుకోటని అందరు అనుకుంటారు కానీ అదంతా పూర్తి అబద్ధమన్నారు. నియోజకవర్గంలో బీసీలు చాలా ఎక్కువని ప్రభుత్వం కూడా బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను అందరు వివరించాలని చెప్పారు. తండ్రి చంద్రమౌళికి ఇచ్చిన హామీమేరకే ఆయన కొడుకు భరత్ కు మద్దతుగా నిలిచిన విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని తెలిపారు. స్కూళ్ళు, ఆసుపత్రులను నాడు నేడు కార్యక్రమంలో డెవలప్ చేసిన విషయం, ఇళ్ళపట్టాల పంపిణి, విలేజ్ సచివాలయం, విలేజ్ క్లినిక్కుల ఏర్పాటు లాంటి వాటిని జగన్ గుర్తుచేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: