అమరావతి : చంద్రబాబును రెండువైపులా కుమ్మేస్తున్నారా ?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు ఇపుడు గడ్డుకాలం నడుస్తున్నదనే చెప్పాలి. రేపటి ఎన్నికల సమయానికి పరిస్ధితులు ఎలాగ మారుతాయో ఎవరు చెప్పలేరుకానీ ఇప్పుడైతే రెండువైపులా వాయింపుడు తప్పటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఒకవైపు జనసేన మరోవైపు బీజేపీ నేతలు చంద్రబాబు పాలనను అత్యంత అవినీతిపరిపాలనగా పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.
జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతు చంద్రబాబు పాలనలో ఎంతో అవినీతి జరిగిందన్నారు. మొన్నటి ఐదేళ్ళపాలనలో ఎన్నోఅరాచకాలు జరిగాయంటు మండిపోయారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అరాచకాల కారణంగానే జనాలు 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లిచ్చి మూలన కూర్చోబెట్టారని ఎద్దేవాచేశారు. చంద్రబాబుపైన వ్యక్తిగతంగా కానీ టీడీపీ పాలనపైన కానీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక్కమాట మాట్లాడకపోయినా కొందరు సీనియర్ నేతలు మాత్రం బాహాటంగానే విరుచుకుపడుతున్నారు.
తాజాగా బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవదర్ మాట్లాడుతు చంద్రబాబు పాలనమొత్తం అంత్యంత అవినీతిమయమంటు రెచ్చిపోయారు. టీడీపీ కుటుంబపార్టీ మాత్రమే కాదని అత్యంత అవినీతికరమైన పార్టీఅని దేవధర్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు జనసేన, బీజేపీ రెండింటితోను పొత్తు పెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు పొత్తు ప్రతిపాదనకు పవన్ ఒకసారి సానుకూలంగాను మరోసారి ఎవరికీ అర్ధంకాని రీతిలోను స్పందిస్తున్న విషయం జనాలంతా చూస్తున్నదే. కానీ బీజేపీ నేతలు మాత్రం మొదటినుండి చంద్రబాబుతో పొత్తును వ్యతిరేకిస్తునే ఉన్నారు.
ఒకవైపు బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు దాదాపు కుదిరినట్లే అన్నట్లుగా ఎల్లోమీడియా కొత్తపాట ఎత్తుకున్న విషయం అందరు చూస్తున్నదే. అయితే ఈ విషయాన్ని కూడా కమలనాదులు ప్రస్తావిస్తున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో మీడియాలో ఎలాంటి వార్తలు వస్తున్నాయనే విషయాన్ని తాము పరిగణలోకి తీసుకునేదిలేదని స్పష్టంగా చెప్పేశారు. అవినీతి, కుటుంబపార్టీతో పొత్తుపెట్టుకూడదన్నదే తమ పార్టీ జాతీయ విధానమంటు కుండబద్దలు కొడుతున్నారు. మొత్తానికి పొత్తుల విషయం ఎలాగున్నా చంద్రబాబు పాలనంతా అరాచకమని, అవినీతిమయంటు పెద్దఎత్తున రెండువైపులా వాయించేస్తున్నారు.