అమరావతి : జూనియర్ కు పోటీగా మరో స్టార్ ను దింపుతోందా ?
రెండు మిత్రపక్షాలే కానీ రెండుపార్టీల్లో దేనికి మరోదానితో సంబంధమే ఉండదు. మీడియా సమావేశాల్లో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో కానీ దేనికాపార్టీయే అన్నట్లుగా ఉంటాయి. ఇంతకీ ఆ రెండుపార్టీలు ఏవనే విషయంలో ఇప్పటికే అర్ధమైపోయుంటాయి. అవును అవే బీజేపీ, జనసేనలు. బహుశా రెండుపార్టీలు కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాయని నమ్మకం లేనట్లుంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో పోటీకి, ప్రచారానికి దేనికాపార్టీయే తురుపుముక్కలను రెడీ చేసుకుంటున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతు జూనియర్ ఎన్టీయార్ సేవలను బీజేపీ ఉపయోగించుకుంటుదన్నారు. బీజేపీ అన్నారే కానీ జనసేతో కలిసి మిత్రపక్షమనలేదు. దాంతో అందరిలోను అనుమానాలు మొదలైనట్లే బహుశా జనసేనలో కూడా అనుమానాలు పెరుగుతున్నట్లున్నాయి. అందుకనే జనసేన కూడా జాగ్రత్తపడుతోంది. జనసేన తరపున రామ్ చరణ్ ను ప్రచారానికి దింపాలని డిసైడ్ అయినట్లుంది. ఇదే విషయాన్ని పార్టీ అధికారప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ ప్రకటించారు.
ఈయన కూడా రామ్ చరణ్ జనసేన తరపున పోటీచేస్తారని చెప్పారే కానీ మిత్రపక్షాల తరపున అని చెప్పలేదు. కాకపోతే బీజేపీ తరపున జూనియర్, జనసేన తరపున రామ్ చరణ్ ప్రచారం చేస్తారని, తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. మొత్తానికి పైకి మిత్రపక్షాలమే అని చెప్పుకుంటున్నా లోలోపల రెండుపార్టీల నేతలు ఒకరిపై మరొకరు అభద్రత, అపనమ్మకంతోనే కాపురం చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.
ఇంతకీ సినీ సెలబ్రిటీలు ప్రచారం చేస్తే ఓట్లు రాలిపోయి సీట్ల వచ్చేస్తాయా ? అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణే పెద్ద సెలబ్రిటీ. పవన్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయారు. ఇక రామ్ చరణ ప్రచారం చేస్తారని బొలిశెట్టి చెప్పారంటే అందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా ? తమ్ముడే అయినా పవన్ రాజకీయాల్లో చిరంజీవి ఎక్కడా జోక్యం చేసుకుంటున్నట్లు కనబడటంలేదు. అలాంటిది ఎన్నికల్లో జనసేన తరపున కొడుకు రామ్ చరణ్ జనసేనకు ప్రచారం చేయటమంటే చిరంజీవి సమ్మతిలేకుండానే ఉంటుందా ?