అమరావతి : చంద్రబాబు ప్లాన్ రివర్సు కొట్టడం ఖాయమేనా ?
అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర అనేది ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది స్టేట్. ఈ యాత్ర చేస్తున్నది అమరావతి పరిరక్షణ సమితి అని పైకి కనబడుతున్నది. అయితే దీనివెనకాల ఉన్నదంతా చంద్రబాబునాయుడే అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. చంద్రబాబు అండదండలు, సూచనలు, ప్రోత్సాహం లేకపోతే ఇదంతా జరిగే అవకాశంలేదు. అమరావతి నుండి అరసవెల్లికి జనాలు పాదయాత్రతో వెళితే ఉత్తరాంధ్రలో ఎక్కడో ఒకచోట గొడవలయ్యే అవకాశాలున్నాయి.
పాదయాత్ర సందర్భంగా గొడవలు జరిగితే రాష్ట్రం ఇమేజి దెబ్బతింటుంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు బాగానే ఉంటారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో పోటీలు పడతారు. మరిదంతా తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు వీళ్ళని ప్రోత్సహిస్తున్నట్లు ? ఎందుకంటే జనాల్లో సెంటిమెంటును రాజేసి పబ్బం గడుపుకోవటమే టార్గెట్ కాబట్టి. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ ప్రకటించినపుడు ఉత్తరాంధ్ర జనాలంతా హ్యాపీగా ఫీలయ్యారు. అంటే జగన్ ప్రకటనను వాళ్ళంతా స్వాగతిస్తున్నట్లే లెక్క.
మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు ఉత్తరాంధ్ర జనాలు అనుకూలంగా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తు అమరావతి జనాలు పాదయాత్ర చేస్తే అక్కడి జనాలు ఎలా స్పందిస్తారు ? ఇపుడేదన్నా గొడవ జరిగితే ప్రభుత్వంపై నాలుగురోజులు ఆరోపణలు, విమర్శలు చేయటానికి చంద్రబాబు అండ్ కో కు అవకాశం దొరక్కచ్చు. కానీ దీర్ఘకాలంలో టీడీపీకి ఉత్తరాంధ్రలో బాగా నష్టం జరుగుతుందన్నది వాస్తవం. మరీవిషయం తెలియకుండానే చంద్రబాబు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా ?
హేమిటో చంద్రబాబు ఈమధ్య చాలాసార్లు సేమ్ సైడ్ గోల్ వేసుకుంటున్నారు. ఏదో చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తే అదికాస్త ఇంకోదో అయిపోతోంది. ఇపుడున్న గొడవలు సరిపోవన్నట్లు చంద్రబాబు అనవసరంగా కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నారు. నిజంగానే మూడు రాజధానులకు జనాలు వ్యతిరేకమైతే వచ్చే ఎన్నికల్లో జగన్ను కచ్చితంగా ఓడగొడతారు కదా. చంద్రబాబు పరిపాలన నచ్చలేదుకాబట్టే జనాలు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడగొట్టి టీడీపీని మూలన కూర్చోబెట్టారు. రేపు జగన్ విషయంలో అయినా జనాలు అదే చేస్తారు. మధ్యలో చంద్రబాబు పూనుకుని ఇంత గోల చేయించటం ఎందుకు ?