హైదరాబాద్ : చంద్రబాబుకు కేసీయార్ గండం

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును కేసీయార్ వదిలిపెట్టేట్లుగా లేరు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తర్వాత తెలంగాణాను చంద్రబాబు మరచిపోయేట్లుగా కేసీయార్ చేశారు. ఓటుకునోటు కేసు రూపంలో  చంద్రబాబు స్వయంకృతం కావచ్చు లేదా కేసీయార్ తెలంగాణా సెంటిమెంటును ప్రయోగించటమూ కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు తెలుగుదేశంపార్టీకి అయితే తెలంగాణా నుండి పంపేయటంలో కేసీయార్ సక్సెస్ అయ్యారు. కేసీయార్ పుణ్యామని తెలంగాణాలో టీడీపీ జెండా పీకేశారు.



సరే అక్కడితో అయిపోయిందని అనుకుంటే ఇపుడు మళ్ళీ జాతీయపార్టీ రూపంలో మళ్ళీ చంద్రబాబు వెంటపడుతున్నారు కేసీయార్. జాతీయపార్టీగా మారిన తర్వాత సదరు పార్టీ ఏపీలో కూడా పోటీచేయటం ఖాయమే. ఎన్నిసీట్లలో పోటీచేస్తుంది ? ఎన్నిఓట్లు వస్తాయనేది అప్రస్తుతం. కొత్తగా పెట్టిన పార్టీకి పోలోమంటు జనాలు ఓట్లేసేసి సీట్లు కట్టబెట్టేస్తారని ఎవరూ అనుకోవటంలేదు. అందునా తెలంగాణా ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ సీమాంధ్రులను కేసీయార్ అనరాని మాటలని బాగా అవమానించారు.



కేసీయార్ చేసిన అవమానాలన్నీ జనాలకు ఇంకా గుర్తున్నాయి. కాబట్టి తన అవసరాలకోసం జాతీయపార్టీ పెట్టుకుని ఏపీలో పోటీచేసినంత మాత్రాన జనాలు ఆ పార్టీని ఆదరిస్తారని ఎవరు అనుకోవటంలేదు. అయితే ఏపిలో కూడా పోటీచేయబోతున్న కేసీయార్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇపుడు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్, వామపక్షాలు కలిసిపోయిన విషయం తెలిసిందే. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కేసీయార్ వామపక్షాలతో చేతులు కలిపారు.



కాబట్టి రేపటి ఏపీ ఎన్నికల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కేసీయార్,వామపక్షాలు కలిసి పోటీచేయబోతున్నాయట. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేసీయార్, వామపక్షాలకు ప్రతి నియోజకవర్గంలోను కనీసం 2 లేదా 3 వేల ఓట్లు పడే అవకాశాలున్నాయి. ఇక్కడ కేసీయార్ పార్టీకన్నా ప్రతి నియోజకవర్గంలోను వామపక్షాలకు పడే ఓట్లే కీలకం. ప్రతి నియోజకవర్గంలో ఈ పార్టీలకు పడే ఓట్లన్నీ టీడీపీకి మైనస్సే కదా. టీడీపీకి మైనస్సంటే వైసీపీకి ప్లస్సన్నట్లే. అంటే ఇలాకూడా చంద్రబాబుకు కేసీయార్ రూపంలో గండం పొంచి ఉందనే అనిపిస్తోంది. మరి దీన్ని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: