హైదరాబాద్ : మునుగోడులో కొత్త ఓట్ల సంచలనం

Vijaya





నవంబర్ 3వ తేదీన జరగబోతున్న మునుగోడు అసెంబ్లీఉపఎన్నికలో ఓటుకోసం రికార్డుస్ధాయిలో దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా ఓటుకావాలంటు  ఏకంగా 23 వేల దరఖాస్తులు వచ్చాయి.  ఓటుహక్కుకోసం వచ్చిన దరఖాస్తులో ఇప్పటికి ఇదే రికార్డని చెప్పాలి. మామూలుగా ఎక్కడ ఉపఎన్నిక జరిగినా  కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య అప్పటికే ఉన్న మొత్తం ఓట్లలో 2 శాతం ఉంటే చాల ఎక్కువ.





అలాంటిది మునుగోడులో ఇపుడు వచ్చిన దరఖాస్తులు 12 శాతముంది. ఏడాదిన్నర కిందట జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా కూడా కొత్త ఓటుహక్కుకోసం వచ్చిన దరఖాస్తులు 1500 మాత్రమే. మునుగోడులోనే కొత్త ఓటుహక్కు కోసం ఎందుకిన్ని వేల దరఖాస్తులు వచ్చాయి ? ఎందుకంటే తెరవెనుక పార్టీ నేతల మంత్రాంగంతో పాటు ఓటుకు నోటు విలువ బాగా పెరిగిపోతోందనే ప్రచారం కూడా కారణమైపోయింది.





ఉపఎన్నికలో గెలవటాన్ని టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కాంగ్రెస్, బీజేపీలు మూడు అత్యంత ప్రతిష్టగా తీసుకున్నాయి. గెలుపు టార్గెట్ తో పోటీలోకి దిగుతున్నాయి కాబట్టి ఖర్చులకు వెనకాడటంలేదు. ఈ నేపధ్యంలోనే ఎంత ఖర్చయినా సరే ఓట్లు వేయించుకోవాల్సిందే అని ప్రిస్టేజికి వెళుతున్నాయి. దాంతో ఓట్ల విషయంలో కమిట్ అవుతున్న వారికి ఒక్కో ఓటుకు వేలరూపాయలు ఇస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. మొన్నటి హుజూరాబాద్ ఉపఎన్నిక కారణంగా మునుగోడు ఉపఎన్నికలో అంచనాలు పెరిగిపోయాయి.





బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఓటుకు రు. 10 వేలు ఇవ్వబోతున్నట్లు ప్రచారం మొదలైపోయింది. మరీ ప్రచారం ఎవరు పుట్టించారో ప్రచారం వెనుక నిజాలు కూడా తెలీవు. దాంతో ఓటుంటే  పోలింగ్ నాటికి తక్కువలో తక్కువ రు. 30 వేలు కూడా వచ్చే అవకాశముందని ప్రచారం పెరిగిపోయింది. ఇందుకనే వేలసంఖ్యలో ఓట్ల నమోదుకు దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. వచ్చిన దరఖాస్తులన్నీ డబ్బుల కోసమే అని చెప్పుందుకు లేదు కానీ మెజారిటి అయితే డబ్బుకోసమే అనుకోవాలి.





వస్తున్న దరఖాస్తులను ప్రాసెస్ చేయటం ఇపుడు అధికారులకు తలకుమించిన పని అవుతోందట. 14వ తేదీవరకు ఓటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికి ఇంకెన్ని వేల దరఖాస్తులు వస్తాయో తెలీదు. జరుగుతున్న వ్యవహారంతో ప్రతిపార్టీ కూడా ప్రత్యర్ధి పార్టీల మీద దొంగఓట్ల నమోదు ఫిర్యాదులు చేస్తున్నది. మొత్తానికి ఓటు దరఖాస్తు పెద్ద గందరగోళమయ్యేట్లుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: