ఉత్తరాంధ్ర : రాజీనామాల అసలు వ్యూహమిదేనా ?
మంత్రులు, కొందరు ఎంఎల్ఏల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమాలు చేయకతప్పదని ప్రకటించారు. ఉద్యమాల్లో పాల్గొనటానికి అవసరమైతే తమ మంత్రిపదవులకు రాజీనామాలు చేయటానికి సిద్ధమంటు ధర్మాన ప్రసాదరావు, కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. వీళ్ళిలా ప్రకటించారో లేదో వెంటనే ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలకు తాము కూడా సై అంటు కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. నిజానికి రాజీనామాల ప్రకటన వ్యూహం వేరే ఉంది.
నిజానికి మంత్రులు, ఎంఎల్ఏల రాజీనామాల ప్రకటన చాలా సిల్లీగా ఉంది. రాజీనామా అస్త్రాలను ఎప్పుడు సంధిస్తారు ? తమ డిమాండ్లు నెరవేరదని నిర్ణయానికి వచ్చినపుడు ప్రభుత్వంపై నిరసనగా మాత్రమే రాజీనామాలంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తానని ప్రతిపాదించింది, మంత్రులు, ఎంఎల్ఏలు అడుగుతున్నది ఒకటే కదా. మరంతా ఒకటే అయినపుడు ఇక రాజీనామాల ప్రస్తావన ఎందుకు ? తాము రాజీనామాలు ప్రకటించగానే టీడీపీ ప్రజాప్రతినిధుల మీద కూడా జనాలు ఒత్తిడి పెంచాలన్నది వైసీపీ ఉద్దేశ్యం.
సరే ఉద్యమంలో భాగంగా ప్రజల్లో మమేకం అవుదామని మంత్రులు, ఎంఎల్ఏలు అనుకన్నారనే అనుకుందాం. పదవుల్లో ఉండగా ఉద్యమాలు చేయటం సరికాదని వీళ్ళు అనుకున్నారనే అనుకుంటే రాజీనామాలు చేయకుండా వీళ్ళని అడ్డుకుంటున్నదెవరు ? జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తే రాజీనామా చేస్తానని ధర్మాన చెప్పటమే విచిత్రంగా ఉంది. ఉద్యమం కోసం రాజీనామా చేస్తానని ధర్మాన చెబితే జగన్ ఏమన్నా అడ్డుకుంటారా ? మంత్రులు, ఎంఎల్ఏలు రాజీనామాలు చేసేస్తే అడ్డుకునే వాళ్ళేలేరు. మరింతోటి దానికి మళ్ళీ జగన్ అనుమతిస్తే అని మెలిక పెట్టడం దేనికి ? ఊరికే రాజీనామాలని ప్రకటనలతో సరిపెడితే ఇక టీడీపీ వాళ్ళపై ఒత్తిడి ఎలాగ పెరుగుతుంది ?
నిజంగానే తమ ప్రాంతం అభివృద్ధి విషయంలో అధికారపార్టీ ప్రజాప్రతినిదుల్లో ఇంత చిత్తశుద్ది ఉందా ? చిత్తుశుద్ది ఉండటమే నిజమైతే తమ రాజీనామాలను కనీసం స్పీకర్ కార్యాలయంకు అయినా అందించాలి. అప్పుడే టీడీపీపై ఒత్తిడి పెరుగుతుంది. లేకపోతే రాజీనామాల ప్రకటన పెద్ద ప్రహసనంగా మారిపోతుంది.