అమరావతి : చంద్రబాబును ఎన్టీయార్ వెన్నుపోటు వెంటాడుతోందా ?
కొన్ని ఘటనలు అంతే పీడకలల్లాగ జీవితాంతం వెంటాడుతునే ఉంటాయి. జనాల కోసం ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా చేసిన పాపాలు లేదా తప్పులు లేదా చేసిన ద్రోహం ఏదో రూపంలో ఏదో సందర్భంలో వెంటాడుతునే ఉంటాయి. ఇదంతా ఎందుకంటే 1995లో ఎన్టీయార్ వెన్నుపోటు ఘటనను స్వయంగా చంద్రబాబునాయుడే కెలుక్కున్నారు. బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఓ టాక్ షో లో చంద్రబాబు అతిధిగా కనిపించబోతున్నారు.
దీనికి సంబంధించిన ప్రోమోను చానల్ విడుదల చేస్తే అది ఒకరకంగా వైరల్ అయింది గానీ బాగా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతోంది. అప్పటి ఎన్టీయార్ వెన్నుపోటును చంద్రబాబు తాజాగా 1995 సంక్షోభంగా సమర్ధించుకున్నారు. జనాలు వెన్నుపోటన్నా, చంద్రబాబు సంక్షోభమన్నా జరిగింది మాత్రం ఎన్టీయార్ ను సీఎంగా దింపేయటం, పార్టీని లాగేసుకోవటం, పార్టీనుండి బయటకు గెంటేయటం, టోటల్ గా పార్టీకి ఎన్టీయార్ కు అసలు సంబంధమే లేదని తేల్చేయటం.
ఎన్టీయార్ వెన్నుపోటు ఘటనను కలలో కూడా తలచుకోవటానికి చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది టాక్ షో లో తనంతట తానుగానే కెలుక్కున్నారంటే అది బాలయ్య టాక్ షో కాబట్టే. టాక్ షోలో అడగబోయే ప్రశ్నలు, వాటికి చెప్పాల్సిన సమాధానాలను చంద్రబాబు ముందుగానే బాగా ప్రిపేరై వచ్చినట్లున్నారు. తన సహజస్వభావానికి విరుద్ధంగా చంద్రబాబు మాట్లాడారంటేనే ఎంతో ప్రిపేరయి వచ్చినట్లు అర్ధమైపోతోంది.
ఎన్టీయార్ వెన్నుపోటును 1995 సంక్షోభంగా జనాలకు వివరించే అవకాశం చంద్రబాబుకు బాలయ్య ఉద్దేశ్యపూర్వకంగానే ఇచ్చినట్లు తెలిసిపోతోంది. ఎందుకంటే హెల్త్ యూనివర్సిటికీ ఎన్టీయార్ పేరు తీసేసిన తర్వాత జరిగిన గొడవలో ఎన్టీయార్ వెన్నుపోటు వ్యవహారంపై మంత్రులు చంద్రబాబుకు చాకిరేవు పెట్టారు. ఎన్టీయార్ పేరు తీసేసే విషయం పక్కకుపోయిన చంద్రబాబు పొడిచిన వెన్నుపోటే బాగా హైలైట్ అయ్యింది. ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవటం కోసమే బావ, బావమరుదులు మాట్లాడుకునే 1995 సంక్షోభం చర్చకు వచ్చేట్లు టాక్ షో ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది.