హైదరాబాద్ : చంద్రబాబును ‘మునుగోడు’ ఇబ్బందుల్లో పడేసిందా ?
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును రెండు విధాలుగా ఇబ్బంది పెడుతోంది. మొదటిదేమో పోటీ చేయకూడదని చివరినిముషంలో నిర్ణయం తీసుకోవటం. ఇక రెండోదేమో ఎవరికి మద్దతుగా నిలబడాలనేది. మొదటి సమస్యేమో నేతలంతా మునుగోడులో పోటీచేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇదే విషయమై రెండుసార్లు సమీక్షలు చేసిన తర్వాత చివరకు ఓకే పోటీలోకి దిగుదామని చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అయితే తెరవెనుక ఏమైందో ఏమో మూడోసారి సమీక్షంటు అందరినీ పిలిచిన చంద్రబాబు ఉపఎన్నికలో పోటీచేయద్దని చెప్పారట. పోటీలోకి దిగటానికి రెడీ అయిపోయిన ఐలయ్యయాదవ్ బాగా అసంతృప్తితో ఉన్నారు. సరే ఏదో కిందామీదాపడి ఆయన అసంతృప్తిని చల్లార్చారు. ముందు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ ఎందుకువద్దన్నారో చంద్రబాబుకే తెలియాలి. సరే ఆ ఎపిసోడ్ ఇపుడు ముగిసిపోయింది.
రెండో సమస్య ఏమిటంటే పోటీలోకి దిగకపోతే పోయే ఎవరికి మద్దతు ఇవ్వాలి ? లేకపోతే ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా నేతలు, శ్రేణులను ఫ్రీగా వదిలేయాలా ? నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న చర్చ ఏమిటంటే టీడీపీ బ్యాచ్ అంతా కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి మద్దతు ఇవ్వబోతున్నారట. ఎందుకంటే రేవంత్-చంద్రబాబు మధ్య ఎంతటి విడదీయరాని బందముందో అందరికీ తెలుసు. కాబట్టి రేవంత్ రిక్వెస్టు కారణంగానే పోటీ నుండి టీడీపీ తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వబోతోందని.
అయితే ఇదే సమయంలో మరో ప్రచారం కూడా మొదలైంది. అదేమిటంటే బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి టీడీపీ మద్దతుకోసం బీజేపీ ప్రయత్నిస్తోందని. మామూలుగా అయితే బీజేపీ గెలిచేది అనుమానంగా మారిందట. అందుకనే టీడీపీ మద్దతుతీసుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వర్కవుట్ చేస్తున్నారనేది. ఎలాగూ బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి రాజగోపాల్ అడిగితే చంద్రబాబు రెడీ అంటారనే ప్రచారం పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే రెండుపార్టీల్లో దేనివైపు మొగ్గుచూపాలో చంద్రబాబుకు దిక్కుతోచటంలేదట.