అమరావతి : అమరావతి జేఏసీకి కోర్టులో కూడా ఎదురుదెబ్బేనా ?
పోలీసులు కొట్టిన దెబ్బనుండి తేరుకోవటానికి అమరావతి జేఏసీ నానా అవస్తలు పడుతోంది. కోర్టులో వేసిన పిటీషన్ ద్వారా కూడా ఊరట దొరకలేదు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో 44 రోజులు పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. అమరావతి టు అరసవల్లి దేవాలయానికి జేఏసీ నాయకత్వంలో భారీ పాదయాత్ర బయలుదేరింది. మొదట్లోనే హైకోర్టు కొన్ని ఆంక్షలను విధించి పాదయాత్రకు అనుమతివ్వమని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కూడా పాదయాత్రకు అనుమతిచ్చారు.
అమరావతిలో మొదలైన పాదయాత్ర కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా ఉభయగోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. మొత్తం 44 రోజులు గడచిన తర్వాత యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంకు చేరుకుంది. ఈ 44 రోజుల యాత్రలో వేలు, లక్షలాది జనాలు హాజరయ్యారని, ఎక్కడిక్కడ జనాలు బ్రహ్మరథం పట్టారని ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఒకటే ఊదరగొట్టాయి. ఎల్లోమీడియా అయితే పాదయాత్రకు మద్దతుగా పేజీలకు పేజీలు కవరేజి ఇచ్చింది.
అంతా బ్రహ్మాండమని అనుకుంటున్న సమయంలో సరిగ్గా రామచంద్రాపురంలో పోలీసులు కోర్టు ఆంక్షలను అమలుచేయటం మొదలుపెట్టారు. ఆంక్షల్లో కీలకమైన గుర్తింపుకార్డులను చూపించమన్నారు. పోలీసులు ఎప్పుడైతే గుర్తింపుకార్డులు అగడటం మొదలుపెట్టారో వెంటనే ఎక్కడివాళ్ళక్కడ జంపైపోయారు. పాదయాత్రలో పాల్గొన్న వేలాదిమందిలో 70 మందికి తప్ప ఇంకెవరికీ గుర్తింపుకార్డులు లేవని తేలిపోయింది. అంటే యాత్రలో పాల్గొన్న వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, టీడీపీ స్పాన్సర్డ్ జనాలన్న విషయం బయటపడిపోయింది. ఇందుకనే అసలు ఆంక్షలే ఉండకూడదని జేఏసీ కోరుకుంటోందిపుడు.
ఇక్కడ విషయం ఏమిటంటే పోలీసులకు మొదట్లోనే అనుమానం వచ్చిందట. అయితే అమరావతి లేదా రాజధాని జిల్లాల్లోనే గుర్తింపుకార్డులు అడగకుండా కావాలనే ఊరుకున్నారు. 44 రోజులు జరగనిచ్చి కొద్దిరోజుల్లో విశాఖపట్నంలోకి యాత్ర అడుగుపెట్టబోతోందన్నపుడు పోలీసులు యాక్షన్లోకి దిగారు. గుర్తింపుకార్డులు అడగ్గానే వేలు, లక్షలాదిమంది జనాలు ఒక్కసారిగా జంప్. దాంతో ఇపుడు మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టాలంటే కష్టమే. ఎందుకంటే పరువంతాపోయి పాదయాత్రంతా బోగస్ అనితేలిపోయింది. అందుకనే ఇపుడు గుర్తింపుకార్డులున్న జనాలకోసం జేఏసీ వెతుకుతోందట. అమరావతి ప్రాంతంలోని వారికెవరికీ పాదయాత్రమీద ఇంట్రస్టున్నట్లు లేదు. మరి గుర్తింపుకార్డులున్న వారు దొరక్కపోతే జేఏసీ ఏమిచేస్తుందో చూడాలి.