గోదావరి : పవన్ కు మద్దతిస్తున్న సెక్షన్ ఏదో తెలుసా ?

Vijaya








వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిపోదామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా కలలే కంటున్నారు. సీఎంగా ఉండటానికి తనకు అన్నీ అర్హతలు ఉన్నాయని, జనాలందరు తనను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు ఆమధ్య పార్టీ సమావేశంలో చెప్పారు. అయితే అసలు వాస్తవం ఏమిటి ? పవన్ చెబుతున్నదంతా నిజమేనా ? అన్నది ఒకసారి పరిశీలించాలి. పవన్ ఎక్కువగా  ఆశలు పెట్టుకున్నది ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే. 




అసలు జనసేన ఓటుబ్యాంకు ఎంతుంది అన్నది పరిశీలిస్తే పవన్ ఆలోచనలు కరెక్టేనా అన్నది తెలుస్తుంది. కాపు సామాజికవర్గంలోని ప్రముఖుల ద్వారా అందుతున్న సమాచారం ఏమిటంటే జనసేనవైపు మొగ్గుచూపుతున్నది కేవలం యువత మాత్రమేనట. యువత అంటే 35 ఏళ్ళలోపు వయసులోని వాళ్ళు మాత్రమే జనసేనకు ఓట్లేస్తామని చెబుతున్నారట. ఇదికూడా కేవలం కాపుయువతలో మాత్రమే మొగ్గు కనబడుతోందట.  కాపేతర యువత సంగతి తెలీదు. కాపుల్లో కూడా మధ్య వయసు జనాల్లో జనసేనపై పెద్ద మొగ్గు కనబడటంలేదని సమాచారం.




మధ్య తరగతి, పెద్దవయస్సు వాళ్ళేమో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంపార్టీ అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారట. కాపుల్లో అత్యధికులు అప్పట్లో తిన్నదెబ్బలను ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారట. అలాంటిది ఇపుడు పవన్ను నమ్ముకుంటే నష్టపోతామని భయపడుతున్నారట. అందుకనే కాపుసామాజికవర్గంలోని ప్రముఖుల్లో ఎవరూ పవన్ తో కలిసి పనిచేయటానికి ఉత్సాహం చూపించటంలేదు. కాపు సంక్షేమ సమితి ద్వారా కాపు ప్రముఖుల్లో ఒకరైన హరిరామజోగయ్య ప్రయత్నాలు ఫెయిలైన విషయాన్ని ఉదహరిస్తున్నారు.




కాపులంతా ఏకమై పవన్ కు అండగా నిలబడాలని జోగయ్య ఎంతగా మొత్తుకుంటున్నా కాపు ప్రముఖులు ఎవరు పట్టించుకోవటంలేదు. ఈ నేపధ్యంలో కాపు యువత మాత్రమే జనసేన వైపు మొగ్గుచూపుతున్నట్లు అర్ధమవుతోంది. మరి కాపుల్లోనే అన్నీ సెక్షన్లు హోలుమొత్తంగా సపోర్టుగా నిలవకపోతే ఇక సీఎంగా చూడాలని అనుకుంటున్నదెవరు ? పైగా వచ్చే ఎన్నికల్లో  చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుంటే ఎంతమంది కాపులు హర్షిస్తారో తెలీదు. సో కాపు ప్రముఖల ద్వారా అర్ధమవుతున్నదేమంటే కాపుల ఓట్లన్నీ జనసేనకు పడేది అనుమానమే అని. మరి ఇక ఏ వర్గాలు పవన్ కు ఓట్లేస్తాయో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: