అమరావతి : చివరకు పవన్ ఎటూ కాకుండా అయిపోతాడా ?

Vijaya







జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీఅయ్యారు. భేటీలో ఏమేమి విషయాలు మాట్లాడుకున్నది సరిగ్గా తెలీదుకానీ టీడీపీతో పొత్తు విషయంలో తొందరపడద్దని పవన్ కు నడ్డా చెప్పినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా చాలాసమయం ఉందికాబట్టి తెలుగుదేశంపార్టీతో కలవటానికి ఇప్పటినుండే తొందరెందుకని పవన్ను బీజేపీ అధ్యక్షుడు అడిగారట. 



నడ్డా మాట్లాడిన మాటలు చూస్తుంటే చంద్రబాబునాయుడుతో పవన్ను కలవనిచ్చేట్లుగా లేరు. మొదటినుండి కూడా చంద్రబాబుతో పవన్ ఎక్కడ కలుస్తారులే అన్న ఉదాసీనతే కమలనాదుల్లో ఎక్కువగా కనబడింది. తమను వదిలి పవన్ ఎక్కడికీ వెళ్ళడన్న ధైర్యంతోనే బాగా నిర్లక్ష్యం చేశారు. తొమ్మిదినెలల కింద వైసీపీ ప్రభుత్వంపై పోరాటంచేయటానికి రోడ్డుమ్యాపు ఇవ్వమని అడిగినా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు రోడ్డుమ్యాపు రెడీ అవుతోందని చెబుతున్నారంతే.



నరేంద్రమోడీ, అమిత్ షా తో భేటీకోసం పవన్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు. మిత్రపక్షంగా తనకు బీజేపీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వటంలేదనే కోపం పవన్లో ఉన్నట్లుంది. అందుకనే అన్నీవిషయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుతో కలిసి పోరాటాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. దాంతో బీజేపీలో కంగారుమొదలై పవన్ను నడ్డా ఢిల్లీకి పిలిపించుకున్నారు. బీజేపీ నేతల సమాచారం ప్రకారం టీడీపీతో పవన్ను ఎట్టిపరిస్ధితుల్లోను కలవనిచ్చేట్లులేరు. వచ్చేఎన్నికల్లో బీజేపీ, పవన్ మాత్రమే కలిసిపోటీచేయాలని అనుకుంటున్నారట.



ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ను ఒకవైపు చంద్రబాబు లాగుతున్నారు. టీడీపీవైపు పవన్ ఒకడుగు ముందుకేసి మళ్ళీ వెనక్కెళుతున్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వంపై చంద్రబాబు పిలుపిచ్చిన పోరుబాటలో జనసేన నేతలు ఎక్కడా కనబడలేదు.  ఇదే సమయంలో బీజేపీ కూడా పవన్ను  ముందుకుపోనీయటంలేదు. అలాగని నెత్తినపెట్టుకునీ తిరగటంలేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తంటే చంద్రబాబుకు ఇబ్బంది. ఇదే సమయంలో ఎన్నికల్లో బీజేపీని పవనే మోయాల్సుంటుంది. ఎంతమోసినా ఉపయోగంలేని కంచిగరుడసేవలాగ అయిపోతుంది. చివరకు ఎన్నికల ముందు ఏమి జరుగుతుందో తెలీదుకానీ పవన్ మాత్రం చివరకు ఎటూ కాకుండా పోతారేమో అనిపిస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: