గోదావరి : పవన్ విషయంలో వైసీపీ రోడ్ మ్యాప్ ఇదేనా ?

Vijaya






రాజకీయాల్లో ఎన్నో చిత్రవిచిత్రాలు జరిగిపోతుంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంచేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీని రోడ్డుమ్యాప్ అడిగారు. పవన్ రోడ్ మ్యాప్ అడిగి తొమ్మిదినెలలైనా ఇంతవరకు రెడీకాలేదు. ఇదే సమయంలో పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ మాత్రం రోడ్ మ్యాప్ ను రెడీచేసేస్తోంది. పవన్ కు వ్యతిరేకంగా రాజమండ్రిలో అధికారపార్టీలోని మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలతో పాటు సీనియర్ నేతలు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే.



ఈ సమావేశంలో మూడు అంశాలపై తీర్మానం చేశారు. మొదటిదేమంటే కాపు సమాజానికి పవన్ వల్ల జరుగుతున్న అన్యాయం. రెండోది విజయవాడలో కాపులతో పెద్ద బహిరంగసభ నిర్వహించటం. మూడో తీర్మానం ఏమిటంటే కాపులకోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న, చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరించటం. ఈ మూడుపాయింట్ల ఆధారంగా ఒక రోడ్డుమ్యాపును రెడీచేయాలని సమావేశం డిసైడ్ చేసింది.



తొందరలో రెడీఅవబోయే రోడ్ మ్యాపులో చంద్రబాబునాయుడు హయాంలో కాపులకు జరిగిన అన్యాయం, తుని రైలుదహనం కేసులో సంబంధంలేని నేతలు, యువతపై కేసులు పెట్టడం, కాపు ఉద్యమనేత ముద్రగడపద్మనాభం కుటుంబాన్ని వేధించటం లాంటి అనేక అంశాలు ఉండాలని కూడా సమావేశం తీర్మానించింది. రాష్ట్రంలోని 70 లక్షలమంది కాపుల్లో తమ ప్రభుత్వం అర్హులైనవారందరికీ సంక్షేమపథకాలను అందిస్తున్నట్లు సమావేశం అభిప్రాయపడింది.



ఇపుడు నిర్వహించిన మీటింగ్ అయినా, భవిష్యత్తులో విజయవాడలో పెట్టబోయే బహిరంగసభ అయినా లేదా రోడ్ మ్యాప్ అయినా కాపులకు పవన్ను వీలైనంత దూరంచేయటమే. జనసేనకు కాపులు ఓట్లేయకుండా అడ్డుకోవటమే వైసీపీ ముఖ్యఉద్దేశ్యం. చంద్రబాబుతో కలవటం వల్ల పవన్ కాపులకు తీరని ద్రోహంచేస్తున్నారని ప్రచారంచేయాలని కూడా సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగానే ఎప్పుడో జరిగిన వంగవీటి రంగా హత్యను, తన తండ్రి రంగాను చంద్రబాబే హత్య చేయించారని కొడుకు వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణల వీడియోలకు విస్తృత ప్రచారం కల్పించాలని కూడా నిర్ణయమైంది. మొత్తానికి పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ తయారు చేయబోతున్న రోడ్ మ్యాప్ ఎంతవరకు  వర్కవుటవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: