రాయలసీమ : బాలయ్యపై లేడీ క్యాండిడేట్ ను దింపుతున్నారా ?
వచ్చే ఎన్నికల్లో హిందుపురం నియోజకవర్గంలో నందమూరిబాలకృష్ణకు పోటీగా లేడీ క్యాండిడేట్ ను దింపటానికి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారా ? పార్టీవర్గాలు అవుననే అంటున్నాయి. ఈమధ్యనే హిందుపురం సమన్వయకర్త చౌళూరి రామకృష్ణారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌళూరికి ప్రత్యర్ధివర్గమైన ఎంఎల్సీ మొహహ్మద్ ఇక్బాల్ మద్దతుదారులే హత్యచేశారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలపై ఎంఎల్సీ పీఏ గోపీకృష్ణతో పాటు మరికొందరిని కూడా పోలీసులు అరెస్టుచేసి విచారిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం చౌళూరి, ఇక్బాల్, సీనియర్ నేత నవీన్ నిశ్చల్ ఎవరికివారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే చౌళూరి-ఇక్బాల్ మధ్య మొదలైన ఆధిపత్య గొడవల కారణంగానే హత్య జరిగినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. చౌళూరికి టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం నేపధ్యంలోనే హత్యకు గురయ్యాడు. మృతుడు జగన్ కు వీరాభిమాని కావటమే కాకుండా పార్టీకోసం నియోజవర్గంలో బాగా గట్టిగా పనిచేస్తున్నాడు.
హత్య జరిగిన తర్వాత కెనడాలో ఉండే చౌళూరి సోదరి మధుమతి హిందుపురం వచ్చారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆమెను జగన్ ప్రత్యేకంగా పిలిపించుకున్నారట. కెనడాకు తాను తిరిగివెళ్ళేది లేదని హిందుపురంలోనే ఉంటానని ఆమె చెప్పారట. ఇదే సమయంలో కొందరు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మధుమతికి మద్దతుగా మాట్లాడారట. దాంతో జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పార్టీలోనే పనిచేయమని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని కూడా చెప్పారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
మధుమతికి టికెట్ ఇస్తే అందరం కలిసి ఆమెను గెలిపించుకుంటామని కూడా కొందరు ప్రజాప్రతినిధులు జగన్ తో చెప్పారట. పోటీచేయటానికి ఆమెకూడా సిద్ధమేనని చెప్పటంతో జగన్ పాజిటివ్ గా స్పందిచారట. సో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఇక్బాల్, నిశ్చల్ టికెట్ పై ఆశలు వదులుకోవాల్సిందే అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పరిస్ధితులన్నీ సానుకూలమైతే వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు పోటీగా వైసీపీ నుండి మధుమతి పోటీ చేస్తుందనే అనుకుంటున్నారు. చౌళూరి హత్య తాలూకు సింపతి మధుమతికి కలిసొస్తుందని జగన్ కూడా అనుకుంటే ఆమెకు టికెట్ ఖాయమైనట్లే.