అమరావతి : జనసేన ఓటు బ్యాంకు పెరిగిపోతోందా ? నిజమేనా ?

Vijaya






ఎంతవరకు నిజమో తెలీదుకానీ జనసేన సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరలవుతోంది. అదేమిటంటే జనసేన ఓటుబ్యాంకు బాగా పెరిగిపోతోందట. బస్సుయాత్ర ప్రారంభం నాటికి మరింతగా పెరిగిపోతుందని చెబుతున్నారు. బస్సుయాత్ర ప్రారంభం కావటం, ఇతర పార్టీల నుండి నేతలు జనసేనలో చేరటం మొదలైతే ఓటుబ్యాంకు ఎంతకి పెరిగిపోతుందో ఎవరూ ఊహించలేరట. దీనికి హేతువు ఏమిటంటే జనసేన ఓటుబ్యాంకు విషయంలో చేసిన సర్వేలే ఆధారమని అంటున్నారు.




ఇక్కడ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు సుమారు 5 శాతం. ఈ ఓటుబ్యాంకు ఇపుడు 13 శాతానికి పెరిగిందట. బస్సుయాత్ర మొదలయ్యేనాటికి 20 శాతానికి పెరగటం ఖాయమట. ఒకసారి యాత్ర మొదలైన తర్వాత ఇతరపార్టీల్లో నుండి నేతలు వచ్చి జనసేనలో చేరటం మొదలైతే 20 శాతం ఓటుబ్యాంకు విపరీతంగా పెరిగిపోవచ్చని జనసేన నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఇదంతా సర్వేల్లోనే వెల్లడైందట.



ఇక్కడే ఈ పోస్టులోని అంశాలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోయిన ఎన్నికల్లో 5 శాతం ఓట్లు వచ్చాయంటే పడిన ఓట్లనులెక్కిస్తే తేలిన లెక్క. కాబట్టి ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరంలేదు. 5 శాతం ఓటుబ్యాంకు 13 శాతానికి పెరిగిందనేందుకు ఆధారం ఏమిటి ?  బస్సుయాత్ర సమయానికి 13 శాతం ఓటుబ్యాంకు 20 శాతానికి పెరుగుతుందని ఎవరు ? ఎలా లెక్కకట్టారు ? ఇతర పార్టీల నుండి నేతలు వచ్చి జనసేనలో చేరటం మొదలైతే 20 శాతం ఓటుబ్యాంకు అమాంతం పెరిగిపోతుందని ఎలా అంచనా వేశారు ?



అసలు జనసేనకు పడే ఓట్లపై సర్వేచేసిందెవరు ? వైరల్ అవుతున్న పోస్టులో పై ప్రశ్నలకు ఎక్కడా సమాధానాలులేవు. ఒకవైపు కాపులవనభోజనాల కార్యక్రమాల్లోనే చంద్రబాబునాయుడుతో పవన్ పొత్తుపెట్టుకోవద్దని మొత్తుకుంటున్నారు. ఈ 20 శాతం ఓటుబ్యాంకు కేవలం పవన్ వల్లమాత్రమే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జనసేనకు ఓటుబ్యాంకు పెరిగిందో తగ్గిందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఏదో కాకిలెక్కలేసుకోవటం తప్ప సరైన ఆధారాలు లేవు. పోస్టుచూసిన తర్వాత జనసేనకు ఓటుబ్యాంకు పెరిగిపోతోందని ఆకాశానికి నిచ్చెనలు వేసుకుంటున్నట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: