అమరావతి : జగన్-కేసీయార్ కలిస్తే ఏమవుతుంది ?
రాజకీయాల్లో ఇలాగే జరుగుతుందని కానీ అలా జరగదని కానీ అనుకునేందుకు లేదు. లెక్కల్లో 2+2= 4 అవుతుందేమో కానీ రాజకీయాల్లో సున్నా కావచ్చు లేదా ఆరుకూడా కావచ్చు. ఈ సూత్రం ఆధారంగానే ఒక చిన్న ఊహ మాత్రంగా అంచనాలు వేశాం. ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటుందో స్పష్టతలేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే ధ్యేయంగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. అయితే ఇద్దరూ కలవటానికి చాలా సమస్యలున్నాయి.
సరే ఈ విషయాన్ని వదిలేస్తే కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీచేస్తుందా ? అనేదే జనాల్లో హాట్ టాపిక్కుగా ఉంది. సీట్లు, ఓట్లు చాలా అవసరం కాబట్టి బీఆర్ఎస్ కచ్చితంగా పోటీచేస్తుందనటంలో అనుమానం లేదు. మరి ఒంటరిగా పోటీచేస్తుందా లేకపోతే పొత్తు పెట్టుకుంటుందా ? అనేది రెండో ప్రశ్న. పొత్తంటే చంద్రబాబు, పవన్ తో కలిసే అవకాశాలు లేవు. ఎలాగూ బీజేపీ బద్ధ శతృవే. కాబట్టి జగన్ తో కలవటానికే ఎక్కువ అవకాశముంది.
జగన్, కేసీయార్ కలిస్తే ఎలాగుంటుంది ? లాభమూ నష్టమూ రెండూ ఉన్నాయి. లాభం ఏమిటంటే చంద్రబాబు, పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి జగన్ కు మరో బలమైన మద్దతుదారు దొరుకుతారు. చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకోకపోయినా పవన్-బీజేపీ పొత్తులోనే పోటీచేసే అవకాశముంది. అప్పుడు ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్, బీజేపీపైన కేసీయార్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతారు. బీజేపీపైన ఆరోపణలు, విమర్శలు చేయటానికి జగన్ ధైర్యం చేయకపోవచ్చు కానీ కేసీయార్ కు ఆ సమస్యలేదు.
చంద్రబాబు, పవన్, బీజేపీలు జగన్ పైన చేసే ఆరోపణలు, విమర్శలకు బీఆర్ఎస్ రూపంలో కౌంటర్లు పడతాయి. ఇక నష్టమంటారా ? జగన్, కేసీయార్ కలిస్తే బీజేపీ చూస్తు ఊరుకుంటుందా ? అప్పుడు బీజేపీ ఏమిచేస్తుందనేదే జగన్ కు అతిపెద్ద సమస్య. కేసీయార్ మీదున్న కోపాన్ని బీజేపీ జగన్ మీద చూపితే మొదటికే మోసం వచ్చినా రావచ్చు. అందుకనే ఈ కాంబినేషన్లపై జస్ట్ ఆస్కింగ్ అంటున్నది.