అమరావతి : వీళ్ళకి జగన్ అంటే లెక్కేలేదా ?

Vijaya





ఇపుడీ విషయమే చాలామందికి అర్ధం కావటంలేదు. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే వర్క్ షాపులో అందరికీ అర్ధమైనది ఏమిటంటే కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు, ఎంఎల్ఏల సంఖ్య పెరుగుతోందని. మంత్రులు, ఎంఎల్ఏలందరు కార్యక్రమంలో పాల్గొనాలని, పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ఒకవైపు జగన్ చెబుతుంటే మరోవైపు జగన్ ఆదేశాలను సైతం లెక్కచేయని వారిసంఖ్య పెరుగుతోంది.



రెండునెలల క్రితం నిర్వహించిన వర్క్ షాపులో కార్యక్రమంలో పాల్గొనని వాళ్ళసంఖ్య 27 ఉంది. అప్పట్లోనే ఇంతమంది కార్యక్రమంలో పాల్గొనకపోవటంపై జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. తాజా వర్క్ షాపులో ఈ లెక్క 27 నుండి 32కి పెరిగింది. అంటే రెండునెలల్లో గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొనని వాళ్ళసంఖ్య అదనంగా  మరో ఐదుకు పెరిగింది. అంటే వీళ్ళకి జగన్ ఆదేశాలంటే లెక్కే లేనట్లుంది. వచ్చేఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనటంపైనే ఆధారపడుంటుందని జగన్ ఇంత స్పష్టంగా చెప్పినా ఎందుకని లెక్కచేయటంలేదు.



విచిత్రం ఏమిటంటే ఈ 32మందిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారట. పార్టీలో, ప్రభుత్వంలో ఉంటూనే జగన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా జగన్ మాటకు ఎదురన్నదేలేదు.  టీడీపీలో లాగ చంద్రబాబునాయుడు మాటను, వార్నింగులను లెక్కచేయకపోయినా ఏమీకాదన్న ధైర్యం లాంటిది వైసీపీలో ఎవరిలోను ఉండదు.



జగన్ ఒకమాట చెబితే, ఒకసారి ఆదేశాలు జారీచేస్తే ఇష్టమున్నా లేకపోయినా ప్రతిఒక్కళ్ళూ వినితీరాల్సిందే తప్ప వేరే దారిలేదు. అలాంటిది తాజా వ్యవహారం ఉల్టాగా ఉంది. వచ్చే మార్చిలో చివరి వర్క్ షాపు నిర్వహిస్తానని అప్పటికి ఫైనల్ లెక్క తేల్చేస్తానని జగన్ వార్నింగ్ ఇచ్చారు. అంటే మార్చి వర్క్ షాపులోనే టికెట్ల కేటయింపు విషయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లే. అయినా 32 మంది లెక్కచేస్తారో లేదో అర్ధం కావటంలేదు. మరి చివరకు గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో ఎంతమందికి టికెట్లు ఇస్తారో ఎంతమందికి కోత కోసేస్తారో తేలిపోతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: