అమరావతి : జగన్ అతిపెద్ద బలమేంటో తెలుసా ?
ప్రతిపార్టీ అధినేతకు ఒక బలముంటుంది. పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు, అవలంభించే వైఖరే పార్టీకి బలంగా మారుతుంది. చంద్రబాబునాయుడుకు ఉన్న బలహీనతే, పవన్ కల్యాణ్ లో లోపించిన స్ధిరత్వమే జగన్మోహన్ రెడ్డికి బలంగా మారింది. ఇదే సమయంలో ఒక విషయంలో స్ధిరభిప్రాయం ఉండటం, అనుకున్నది అనుకున్నట్లు అమల్లోకి తీసుకురావటం, ఆచరించటమే జగన్ బలంగా మారింది. వాళ్ళిద్దరికీ లేని సోషల్ ఇంజనీరింగే జగన్ అతిపెద్ద బలం.
సామాజికవర్గాల వారీగా ప్రముఖులను లేదా సదరు సామాజికవర్గంలోని మెజారిటి జనాలకు లబ్ది చేకూర్చటాన్ని ఇపుడు సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఒకపుడు సామాజికవర్గాల్లోని ప్రముఖులకు లబ్ది చేకూర్చటం, వివిధ పదవులను కట్టబెట్టడాన్ని చాలా మామూలుగా తీసుకునే వారు. అయితే ఎక్కడో పైస్ధాయిలో మ్యానేజ్ చేస్తే కిందస్ధాయిదాకా మంచి చేసినట్లే అనే పద్దతి పోయింది. ఇందులో భాగంగానే సోషల్ ఇంజనీరింగ్ అనే ప్రక్రియ మొదలైంది.
ఇపుడిదంతా ఎందుకంటే మార్చినుండి జూలై మధ్యలో 21 ఎంఎల్సీ పదవులు ఖాళీ అవబోతున్నాయి. ఖాళీ అవబోయే పోస్టులన్నీ వైసీపీ ఖాతాలోనే పడటం ఖాయం. జనరల్ ఎన్నికలకు మరో ఏడాన్నరుండగా ఒకేసారి ఇన్ని ఎంఎల్సీలు రావటమంటే అధికారపార్టీకి ఎంత అడ్వాంటేజో చెప్పక్కర్లేదు. ఇక్కడే జగన్ సోషల్ ఇంజనీరింగ్ కెపాసిటి అర్దమైపోతోంది. ఎంఎల్ఏల కోటా, గవర్నర్ కోటాతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో భర్తీ చేయాల్సిన 21 స్ధానాలు తొందరలో వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి.
ఈ పోస్టుల భర్తీలో జగన్ కచ్చితంగా బీసీ, కాపు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారనటంలో సందేహంలేదు. పోయిన ఎన్నికల్లో బీసీ, కాపులకు ఇచ్చిన అధిక ప్రాధాన్యత కారణంగానే వైసీపీకి అఖండ మెజారిటి సాధ్యమైంది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే పద్దతిని జగన్ కంటిన్యు చేస్తున్నారు. కాబట్టి రేపు భర్తీచేయబోయే 21 ఎంఎల్సీలను కూడా సోషల్ ఇంజనీరింగ్ పద్దతిలోనే సర్దుబాటు చేస్తారు. సోషల్ ఇంజనీరింగును కచ్చితంగా అమలు చేయటమే జగన్ కు అతిపెద్ద బలంగా మారిందనటంలో సందేహంలేదు.