అమరావతి : నిజంగానే ఎమర్జెన్సీ పరిస్ధితులున్నాయా ?
‘ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీకన్నా దారుణమైన పరిస్దితులున్నాయి’...ఇది చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. పవనే కాదు చంద్రబాబు కూడా ఇలాంటి ఆరోపణలే రెగ్యులర్ గా చేస్తున్నారు. వీళ్ళ ఆరోపణలు, వ్యాఖ్యలను పక్కనపెట్టేస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్దితులున్నాయా ? అన్నది పాయింట్. ఎమర్జెన్సీ నాటి పరిస్ధితులంటే చంద్రబాబు, పవన్ కు తెలుసో తెలీదో.
అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ ప్రభుత్వం జైళ్ళల్లో కుక్కేసింది. మీడియా మీద సెన్సార్ షిప్ విధించింది. ప్రభుత్వం అనుమతిలేకుండా ఒక్క పేపర్ కూడా ప్రింట్ కాలేదు, ప్రింటయిన పేపర్ మార్కెట్లోకి రాలేదు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారనే కారణంతో వేలాదిమందిని జైళ్ళలోకి తోశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ఏ పత్రికలోను కనబడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకం అని అనుకున్న వాళ్ళందరిపైనా అప్పట్లో పోలీసులు ఎలాంటి విచారణలు లేకుండానే కేసులు పెట్టేసి కోర్టుల్లో శిక్షలు వేయించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలామంది రాజకీయనేతలు భయపడి వణికిపోయేవారు. మరప్పటి పరిస్ధితులకు ఇప్పటి పరిస్ధితులకు నిజంగానే పోలీకలున్నాయా ? పొద్దున లేచిందగ్గర నుండి రాత్రి పడుకునేవరకు జగన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల నేతలు నోటికొచ్చింది మాట్లాడుతునే ఉన్నారు. ఎవరిపైనైనా ప్రభుత్వం కేసులుపెట్టిందా ? ఎల్లోమీడియాలో జగన్ పై వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వంపైన కూడా బురదచల్లేస్తున్నారు. ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు, అరెస్టులు జరగలేదు. జగన్ కు వ్యతిరేకంగా మీడియా రెచ్చిపోతున్నట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో మీడియా ఆ సీఎంల మీద బురదచల్లేయటంలేదేమో.
ప్రతిపక్షాలైనా, ఎల్లోమీడియా అయినా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. అయినా వీళ్ళని ప్రభుత్వం కంట్రోల్ చేయటానికి ప్రయత్నంకూడా చేయలేదు. వాస్తవాలు ఇలాగుంటే మరి ఏపీలో ఎమర్జెన్సీకన్నా దారుణమైన పరిస్ధితులున్నాయని చంద్రబాబు, పవన్ అన్నారంటే అర్ధమేంటి ? ఎమర్జెన్సీ పేరుచెప్పి జగన్ ప్రభుత్వంపై బురదచల్లటమే టార్గెట్ అని అర్ధమైపోతోంది. అయితే వీళ్ళు బురదచల్లేయచ్చు కానీ ప్రజలకు తెలుసుకదా ఏమి జరుగుతోందో ?