అమరావతి : నారాయణ గట్టిగా తగులుకున్నట్లేనా ?
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు అక్రమాల్లో మాజీమంత్రి పొంగూరు నారాయాణ గట్టిగా తగులుకున్నట్లే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని చంద్రబాబునాయుడు డిసైడ్ చేశారు. దానిప్రకారమే వేలాది ఎకరాల భూసమీకరణ చేపట్టారు. భూసమీకరణ ముసుగులో వేలాది ఎకరాల అక్రమాలకు తెరలేచిందనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు. ఈ విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నపుడు జగనే చాలాసార్లు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు.
అనుకున్నట్లే అధికారంలోకి రాగానే రాజధాని భూముల అక్రమాలపై సిట్ విచారణ జరిగింది. సిట్ అందించిన ఆధారాల ప్రకారం సీఐడీ కేసులు నమోదుచేసి విచారణ జరుపుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి అప్పట్లో భూసమీకరణ, రాజధాని నిర్మాణాలకు సూత్రదారుడైన మాజీమంత్రి నారాయణను సీఐడీ అరెస్టు కూడా చేసింది. అయితే ఆయన కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. ఇపుడు హఠాత్తుగా నారాయణ సంస్ధలపై సీఐడీ సోదాలు చేసింది.
ఈ సోదాల్లో నారాయణ అక్రమాలకు పాల్పడ్డారనేందుకు అవసరమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దొరికినట్లు ప్రచారం మొదలైంది. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా డబ్బును పంపిణీచేసి తన బినామాలతోనే అసైన్డ్ భూములను కొన్నట్లుగా ఆధారాలు దొరికాయంటున్నారు. జరిగిన వేలాది ఎకరాల భూ అక్రమాల్లో 1100 ఎకరాలు కేవలం అసైన్డ్ భూములే ఉన్నాయని ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకిచ్చిన భూములనే అసైన్డ్ భూములంటారు. ఈ భూములను ఎవరు కొనకూడదు.
అలాంటిది అమరావతి పరిధిలోని 1100 ఎకరాల అసైన్డ్ భూములను నారాయణతో పాటు చాలామంది టీడీపీ ముఖ్యులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలోనే నారాయణ సంస్ధల్లో సోదాలు జరిగాయి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులను కూడా సీఐడీ స్వాధీనం చేసుకున్నదట. రామకృష్ణ హౌసింగ్ కు డబ్బులు అందించింది నారాయణే అని దాని ద్వారా నిధులు పంపిణీచేసి తన మనుషులను బినామీలుగా పెట్టి 169 ఎకరాలను కొన్నట్లు సీఐడీ ఆరోపిస్తోంది. నారాయణపై ఆరోపణలు తేలితే మిగిలిన అక్రమాలన్నీ వెలుగుచూస్తాయి. మరి నారాయణ తగులుకున్నట్లేనా ?