హైదరాబాద్ : సోమేష్ ఏం చేయబోతున్నారు ?
తెలంగాణా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణా సీఎస్ గా రిలీవ్ చేసిన ఢిల్లీలోని శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) సోమేష్ ను 12వ తేదీకల్లా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయమని ఆదేశించింది. అయితే సోమేష్ మాత్రం ఏకంగా సర్వీసునే వదులుకోవాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఏడాదిలో రిటైర్ అవబోతున్న సోమేష్ వీఆర్ఎస్ తీసుకుని బీఆర్ఎస్ లో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
సమైక్య రాష్ట్రంలోని ఆలిండియా సర్వీసేస్ అధికారులను విభజన కారణంగా డీవోపీటీ రెండు రాష్ట్రాల్లోను సర్దుబాటు చేసింది. దాని ప్రకారం సోమేష్ ఏపీ క్యాడర్లో పనిచేయాలి. అయితే ఏపీకి వెళ్ళటానికి ఇష్టపడని సోమేష్ ట్రైబ్యునల్లో కేసు వేసి తనను తెలంగాణాలో ఉంచేట్లుగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దానిపై కేసులు నడిచి చివరకు మంగళవారం హైకోర్టు తీర్పుతో సోమేష్ తెలంగాణా క్యాడర్ రద్దయ్యింది. ట్రైవ్యునల్ తీర్పును హైకోర్టు రద్దుచేయటం, సోమేష్ ను డీవోపీటీ ఆగమేఘాల మీద తెలంగాణా క్యాడర్ ను క్యాన్సిల్ చేసి ఏపీలో రిపోర్టు చేయమని ఆదేశించటం జెట్ స్పీడుతో జరిగిపోయింది.
అయితే సోమేష్ మాత్రం ఏపీలో రిపోర్టుచేయటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదట. ఎందుకనో మొదటినుండి సోమేష్ కు ఏపీ అంటే చాలా విముఖంగానే ఉన్నారు. తెలంగాణాలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ ఏపీలో రిపోర్టు చేస్తే ఏదో ఒక పోస్టు ఇస్తారే కానీ చీఫ్ సెక్రటరీ అయితే ఇవ్వరు.
తెలంగాణాలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఏపీలో ఏదో పోస్టులో సర్దుకోవాలంటే ఎవరికైనా కష్టమే. అందులోను ఏపీని వ్యతిరేకిస్తున్న సోమేష్ కు ఇంకా కష్టం. అందుకనే ఐఏఎస్ అధికారిగా వీఆర్ఎస్ తీసేసుకుని బీఆర్ఎస్ లో చేరిపోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని మంగళవారం రాత్రి కేసీయార్ తో భేటీ సందర్భంగా చెప్పారని అందుకు ముఖ్యమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం మొదలైంది. ఉన్నతాధికారులుగా పనిచేసిన కొంతమంది బీఆర్ఎస్ లో చేరటం కొత్తేమీకాదు. కాబట్టి సోమేష్ వ్యవహారం 12వ తేదీకి తేలిపోతుంది.