అమరావతి : పవన్ ఎందుకు రెచ్చిపోతున్నారు ?
ఇపుడీ విషయమే అర్ధంకావటంలేదు. రోడ్డు షోలు, సభలు, ర్యాలీలను నిర్వహించటం వల్ల నష్టపోతామని చంద్రబాబునాయుడు అనుకున్నారంటే అర్ధముంది. ఎందుకంటే అచ్చంగా చంద్రబాబు సభలకు రమ్మంటే జనాలు వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి తన సభలను నియంత్రించటానికే ప్రభుత్వం నిషేధం విధించిందని చంద్రబాబు గోలచేస్తున్నారంటే అర్ధముంది. మరి పవన్ విషయంలో అదేమీలేదు కదా. పవన్ను జనసేన అధినేతగా కన్నా సినిమాల్లో పవర్ స్టార్ గానే అభిమానులు చూస్తున్నారు. రణస్ధలంలో బహిరంగసభ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. సభ నిర్వహణకు పోలీసులు బాగా సహకరించారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
పవన్ వస్తున్నారంటే చూడటానికి అభిమానజనం ఎగబడతారు. అది రోడ్డుషో కావచ్చు, ర్యాలీ కావచ్చు. చివరకు బహిరంగసభ నిర్వహించినా జనాల సంగతి వదిలేస్తే అభిమానులైతే వచ్చేస్తారు. కాబట్టి ప్రభుత్వం నిషేధంవల్ల తన సభలకు జనాలు రారేమో అని పవన్ భయపడాల్సిన అవసరంలేదు. అయినా ప్రభుత్వం తెచ్చిన జీవోను చీకటి జీవో అని బ్రిటీషుకాలంనాటి జీవో అంటు ఎందుకని గోలచేస్తున్నారో అర్ధంకావటంలేదు. ఏ ప్రభుత్వం జారీచేసే ఉత్తర్వులైనా బ్రిటీషుకాలం నాటి చట్టాల ఆధారంగానే కదా జారీ అవుతున్నది.
ప్రభుత్వం తాజా ఉత్తర్వులపై ఇంత గోలచేస్తున్న పవన్ మరి చంద్రబాబు సభల్లో నాలుగురోజుల వ్యవధిలో 11 మంది చనిపోయినపుడు ఎందుకని నోరెత్తలేదు. టీడీపీ నిర్వహణలోపం వల్లే 11 మంది చనిపోయారని అందరికీ తెలిసినా పవన్ కు అలా అనిపించలేదా ? రెండుసభల్లో తొక్కిసలాట జరిగి జనాలు చనిపోతే పవన్ కు చంద్రబాబును నిలదీయాలని, తప్పుపట్టాలని అనిపించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
రెండు సందర్భాల్లో కూడా ఏదో మొహమాటం కొద్దీ సంతాపం ప్రకటించేందుకు నాలుగు లైన్లతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఘటనే జగన్ లేదా వైసీపీ కార్యక్రమంలో జరిగుంటే పవన్ స్పందన ఇలాగే ఉండేదా ? ప్రభుత్వ ఉత్తర్వులపై కోర్టులో కేసు వేస్తుందని పవన్ సోదరుడు నాగబాబు ప్రకటించారు. అయితే జనసేన కాకుండా సీపీఐ రామకృష్ణ కేసు వేశారు. విచారణ సందర్భంగా ఉత్తర్వులను కోర్టు 23 వరకు సస్పెన్షన్లో ఉంచింది. తర్వాత ఏమవుతుందో చూడాలి. కార్యక్రమాల్లో జనాలు చనిపోయినా పర్వాలేదు కానీ రోడ్డుషోలు, ర్యాలీలు, రోడ్లపై సభలను మాత్రం నియంత్రించకూడదన్నట్లే ఉంది సోదరుల వాదన.