హైదరాబాద్ : తెలంగాణాలో 10 మంది ఎంఎల్ఏలా ? అయ్యేపనేనా ?
జనసేన అధినేత ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారు. పూర్తిగా భ్రమల్లో బతికేస్తున్నారనటానికి తాజా వ్యాఖ్యలే నిదర్శనం. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు చేయించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణా అసెంబ్లీలో కనీసం 10 మంది జనసేన ఎంఎల్ఏలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒకపుడేమో తెలంగాణా 30 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలున్నాయన్నారు. ఇపుడేమో కనీసం 10 మంది ఎంఎల్ఏలుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇక్కడే పవన్ మాటల్లోని డొల్లతనం బయటపడింది. పైగా తెలంగాణాలో నాయకత్వ లక్షణాలున్న యువత కోసం వెతుకుతున్నట్లు చెప్పటం విచిత్రంగా ఉంది. తెలంగాణాలో షెడ్యూల్ ఎన్నికలకు ఉన్న గడువు 10 నెలలు మాత్రమే. కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. నాయకత్వ లక్షణాలున్న యువతను పవన్ వెతికేదెప్పుడు ? వాళ్ళని పార్టీలో చేర్చుకునేదెప్పుడు ? వాళ్ళకి రాజకీయాలు అర్ధమయ్యేదెప్పుడు ? వాళ్ళు పోటీచేసేదెప్పుడు ?
నిన్నటివరకు పవన్ దృష్టంతా ఏపీలోనే ఉండేది. అలాంటి ఏపీలోనే పార్టీ నిర్మాణం జరగలేదు. నిజానికి ఏపీలోనే జనసేనకు దిక్కులేదు. అలాంటిది తెలంగాణాలో కూడా రాజకీయం చేస్తానని పవన్ చెబితే ఎవరు నమ్ముతారు ? ఎన్నికల్లో నిలబడేది ఏముంది ఎవరైనా పోటీచేయచ్చు. కానీ జనాలు ఓట్లేయాలి కదా. ఏపీలోనే దిక్కులేని పార్టీకి ఇక తెలంగాణాలో ఏముంటుంది ? ఇలాంటి పార్టీ 7-14 ఎంపీ స్ధానాల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.
పైగా తెలంగాణా అసెంబ్లీలో కనీసం 10 మంది ఎంఎల్ఏలుండాలని పవన్ కోరుకుంటున్నారు. 10 మంది ఎంఎల్ఏలు కాదుకదా పది నియోజకవర్గాల్లో డిపాజిట్లు తెచ్చుకుంటే అదే చాలా ఎక్కువ. అభిమానులను చూడగానే నోటికొచ్చింది ఏదేదో మాట్లాడేయటం, పూనకంతో ఊగిపోవటం పవన్ కు బాగా అలవాటైపోయింది. ఇపుడు కూడా ఆ పూనకంలోనే మాట్లాడేసినట్లున్నారు. అంతా బాగానే ఉందికానీ అసలింతకీ పోటీచేసే నియోజకవర్గాలెన్నో మాత్రం చెప్పలేదు. మరచిపోయుంటారా ? లేకపోతే అసలెన్ని నియోజకవర్గాలున్నాయో తెలీలేదా ?