కోస్తా : కోటంరెడ్డికి షాక్ తప్పదా ?

frame కోస్తా : కోటంరెడ్డికి షాక్ తప్పదా ?

Vijaya


నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి పరిస్ధితి అన్యాయమైపోయేట్లుగా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొబైల్ ట్యాపింగ్ ఆరోపణలు చేయటంద్వారా  మూడు రోజులుగా ఎంఎల్ఏ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న విషయం అందరు చూస్తున్నదే. తన కదలికలపై ప్రభుత్వం స్పెషల్ బ్రాంచ్ నిఘా పెట్టిందని, తన ఫోన్ను ట్యాప్ చేస్తోందనే ఆరోపణలు చేయటంతో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోటంరెడ్డి ఆరోపణలు చేస్తారని, వ్యతిరేకమవుతారని ఎవరూ ఊహించలేదు.



ఇపుడు కోటంరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన, చేస్తున్న ఆరోపణలు కలకలం సృష్టిస్తోంది. జరుగుతున్న పరిణామాలతో ఎన్నోరోజులు కోటంరెడ్డి వైసీపీలో కంటిన్యు అయ్యే అవకాశంలేదని అర్ధమైపోతోంది. ఎందుకంటే ఆయన వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి లాగ కేవలం ఆరోపణలు, విమర్శలకు మాత్రమే పరిమితంకాలేదు. ఒకడుగు ముందుకేసి తనకు అవమానం జరిగిన పార్టీలో ఇక ఉండలేనని, రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేస్తానని ప్రకటించారు.



దాంతో మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు అందరు కోటంరెడ్డిని ఇపుడు చంద్రబాబునాయుడు కోవర్టుగా చూస్తున్నారు. పైగా నియోజకవర్గానికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధిగా జగన్ ప్రకటించేశారు. దాంతో కోటంరెడ్డికి ఇక పార్టీ నుండి ఎక్జిట్ అవటం తప్ప మరో మార్గంలేదు. ఇదే సమయంలో టీడీపీ కూడా కోటంరెడ్డిని నమ్మటంలేదు. దీనికి ఆధారం రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీటే.



‘వైసీపీ కోవర్టు డ్రామా స్టార్టయినట్లుంది..రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా..జర జాగ్రత్త తమ్ముళ్ళు’ అంటూ గోరంట్ల చేసిన ట్వీట్ పై పార్టీలో చర్చ జరుగుతోంది. అంటే కోటంరెడ్డి టీడీపీలోకి జగన్ కోవర్టుగా రాబోతున్నట్లు అనుమానిస్తున్నారని అర్ధమవుతోంది. కోటంరెడ్డి ఒక ప్లాన్ ప్రకారమే జగన్ తో గొడవపడినట్లు నటిస్తు టీడీపీలోకి రాబోతున్న కోవర్టు అని బుచ్చయ్య ట్వీటుకు అర్ధం. మరి ఇటు వైసీపీలో ఉండలేక అటు టీడీపీలోను నమ్మకపోతే చివరకు కోటంరెడ్డి రెంటికి చెడ్డ రేవడి అయిపోతారేమో ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: