అమరావతి : వైసీపీని వెంటాడుతున్న రెండు గండాలు ?

Vijaya



మంత్రులు, ఎంఎల్ఏలు, ముఖ్యమైన సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో రాబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరో ఏడాదిన్నరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలు జననాడిని అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. అందుకనే జగన్ కూడా మార్చిలో జరగబోయే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని పదే పదే చెప్పింది. మొత్తం 14 స్ధానాలకు జరగబోయే ఎన్నికల్లో తొమ్మిది స్ధానాలను గెలుచుకోవటం చాలా ఈజీ.




మిగిలిన ఐదుస్ధానాల్లో గెలుపుకోసమే కష్టపడాలని అందరికీ జగన్ చెప్పింది. విషయం ఏమిటంటే మొత్తం 14 స్ధానాల్లో 9 లోకల్ బాడీ కోటాలో ఉన్నాయి. మరో మూడు పట్టభద్రుల కోటా, మిగిలిన రెండు గ్రాడ్యుయేట్ల కోటాలోను భర్తీ అవ్వాలి. ఇపుడు సమస్యంతా ఈ ఐదు స్ధానాల్లో గెలుపు మీదే ఉంది. ఎందుకంటే వివిధ కారణాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాలు 1వ తేదీన చెల్లించటం లాంటి అనేక ఆర్ధిక అంశాలపై ఉద్యోగులు మండుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ లాంటి నిబంధనలతో ఉపాధ్యాయులూ మండిపోతున్నారు.



అలాగే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయటంలేదని నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు లేవనెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానాలు ఇస్తున్నా వీళ్ళు పట్టించుకోవటంలేదు. ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇవ్వలేకపోవటం జగన్ ఫెయిల్యూరనే చెప్పాలి. ఎన్ని ఖర్చులున్నా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకిచ్చే పెన్షన్ల కోసం ప్రతినెలా చివరి వారంలో ప్రభుత్వం సుమారు రు. 6 వేల కోట్లు రెడీ చేసుకోవాల్సిందే.



ఇందులో ఫెయిలయ్యారు కాబట్టే ఉద్యోగులకు ప్రభుత్వంతో రెగ్యులర్ గా గొడవలవుతున్నాయి. ఇపుడు కూడా ఆర్ధిక, ఆర్ధికేతర డిమాండ్లను పరిష్కరించకపోతే ఈనెల 26వ తేదీ నుండి ఉద్యమం చేయబోతున్నట్లు ఏపీ జేఏసీ నేతలు చీఫ్ సెక్రటరీకి నోటీసిచ్చారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు ఉద్యమం అంటే ప్రభుత్వానికి ఇబ్బందనే చెప్పాలి. ఎందుకంటే పై ఐదుస్ధానాల్లో ఓట్లేయాల్సింది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులే. అందుకనే ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపుపైనే జగన్ ఇంత గట్టిగా చెప్పింది. మరి పై రెండు గండాలను అభ్యర్ధులు ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: