రాయలసీమ : అక్కా చెల్లెళ్ళు విడిపోతున్నారా ?
జరుగుతున్న ప్రచారమైతే అలాగే ఉంది. అక్క టీడీపీలో ఉంది కాబట్టి తొందరలోనే చెల్లెలు వైసీపీ కండువా కప్పుకోవటం ఖాయమని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వారసులుగా భూమా అఖిలప్రియ, మౌనిక, జగత్ విఖ్యాతరెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 2014లో భూమా నాగిరెడ్డి దంపతులు నంద్యాల, ఆళ్ళగడ్డలో వైసీపీ తరపున ఎంఎల్ఏలుగా గెలిచారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల కారణంగా నాగిరెడ్డి, ఉపఎన్నికల్లో గెలిచిన అఖిలప్రియ టీడీపీలో చేరారు.
తర్వాత నాగిరెడ్డి కూడా మరణించగా ఉపఎన్నికల్లో అన్నకొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి ఇద్దరు ఓడిపోయారు. అప్పటికి చిన్నపిల్లలుగా ఉన్న మౌనిక, జగత్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. వచ్చేఎన్నికల్లో పోటీచేయాలని మౌనిక గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీలో అవకాశం లేదుకాబట్టి వైసీపీలో చేరాలని మౌనిక డిసైడ్ అయ్యారట. ఇప్పటికే భూమా వారసుల మధ్య అనేకరకాలుగా గొడవలు జరుగుతున్నాయి.
ఇది సరిపోదన్నట్లు రాజకీయ ప్రవేశం ఆలోచనతో అక్కా,చెల్లెళ్ళ మధ్య గొడవలు మరింత పెరిగాయట. ఈమధ్యనే వివాహం చేసుకున్న మౌనిక తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్ ను వివాహం చేసుకున్న మౌనిక వచ్చేఎన్నికల్లో చంద్రగిరి నుండి పోటీచేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. చంద్రగిరిలో సిట్టింగ్ ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల్లో ఒక్కళ్ళు. అలాంటి చెవిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో తిరుపతిలో పోటీచేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి మీద జనాల్లో బాగా అసంతృప్తి ఉందని సర్వేల్లో బయటపడిందట. ఇదే సమయంలో కొడుకు అభినయ్ రెడ్డికి టికెట్ ఇవ్వటం జగన్ కు ఇష్టంలేదట. అందుకనే మధ్యేమార్గంగా చెవిరెడ్డిని తిరుపతిలో పోటీచేయించి మౌనికకు చంద్రగిరిలో టికెట్ ఇచ్చే విషయం పరిశీలనలో ఉందనేది ప్రచారం. అసలు మౌనికకు చంద్రగిరిలో కానీ ఇంకెక్కడైనా కానీ జగన్ టికెట్ ఎందుకివ్వాలనే ప్రశ్నకు సమాధానం దొరకటంలేదు.