అమరావతి : ఆనంకున్న బుద్ధి కూడా కోటంరెడ్డికి లేదా ?
బడ్జెట్ సెషన్ సందర్భంగా మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి స్వపక్షంలోనే విపక్షంలాగ తయారైన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు పూర్తి రెబల్ గా మారిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగటం ఇదే మొదటిసారి. ఈ సమావేశాల్లో కోటంరెడ్డి పూర్తి రెచ్చిపోగా, ఆనం మాత్రం చాలా ప్రశాంతంగా మౌనంగా కూర్చున్నారు.
దీంతోనే వీళ్ళిద్దరు తమ అసంతృప్తిని వ్యక్తంచేయటానికి చెరో దారిని ఎంచుకున్నట్లు అర్ధమైంది. స్వతహాగానే కోటంరెడ్డి ఆవేశపరుడు. అందుకనే సమావేశం మొదలవ్వగానే అసెంబ్లీ బయట ప్లకార్డు పట్టుకుని గోల చేశారు. ఆ తర్వాత సభలోకి వచ్చి తన సీట్లో నిలబడే అరుపులతో రెచ్చిపోయారు. దీన్ని మంత్రులు, స్పీకర్ పట్టించుకోకపోవటంతో నేరుగా స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి రచ్చచేశారు. సీట్లోకి వెళ్ళి కూర్చోమని ఎంత చెప్పినా వినకపోవటంతో స్పీకర్ ఎంఎల్ఏని సెషన్ పూర్తిగా సస్సెండ్ చేసేశారు. తన ఆవేశం కారణంగానే కోటంరెడ్డి సభలోకి అడుగుపెట్టే అవకాశం కోల్పోయారు.
ఇదే సమయంలో ఆనం మాత్రం తన సీటులో నుండి లేవనేలేదు. సభలోనే ఉన్న మంత్రులు, ఇతర ఎంఎల్ఏలు ఎవరూ ఆనంతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆనంకూడా ఎవరి దగ్గరకు వెళ్ళకుండా, ఎవరితోను మాట కలపకుండా ఉదయం నుండి సాయంత్రంవరకు మౌనంగానే కూర్చున్నారు.
మధ్యలో టీ విరామసమయంలో అసెంబ్లీ లాబీల్లో ఒకసారి మాజీమంత్రి కన్నబాబుతో ఆనం మాట్లాడారంతే. తర్వాత లాబీల్లో ఆనం, కోటంరెడ్డి ఇద్దరే మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకున్నారో తెలీదు కానీ టీ విరామం అవ్వగానే సభలో కోటంరెడ్డి రెచ్చిపోయారు. దాని ఫలితమే సెషన్ అయ్యేవరకు సస్పెన్షన్ వేటు. కోటంరెడ్డేమో పూర్తిగా రెచ్చిపోయి సస్పెండ్ అయితే ఆనం ఏమో ఎవరితోను ఏమీ మాట్లాడకుండా తన సీటులో నుండి లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారు. దీంతోనే వీళ్ళద్దరి రహదారి చెరోదారి అన్నట్లుగా అర్ధమైంది.