అమరావతి : గెలుపుకోసం చంద్రబాబు ప్లాన్ ఇదేనా ?
గురువారం జరగబోతున్న ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబునాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ప్యాకేజీలంతా వైసీపీలోని అసంతృప్త ఎంఎల్ఏలను ఆకర్షించేందుకోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడు ఎంఎల్సీ స్ధానాలను గెలుచుకునేందుకు వైసీపీ ఏడుగురు అభ్యర్ధులను రంగంలోకి దింపింది. ఏకగ్రీవం అవ్వాల్సిన ఎన్నిక కాస్త టీడీపీ కారణంగా పోటీగా మారింది. ఒక్క స్ధానం కూడా గెలుచుకునే అవకాశం లేకపోయినా చంద్రబాబునాయుడు బీసీ మహిళా నేత పంచుమర్తి అనూరాధను పోటీలోకి దింపారు.
ఎప్పుడైతే పోటీ అనివార్యమైందో అప్పటినుండే గెలుపుకోసం పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు మొదలుపెట్టాయి. పంచుమర్తి గెలుపుకు అవసరమైన 22 మంది ఎంఎల్ఏల బలం లేదు కాబట్టి వైసీపీ ఎంఎల్ఏలకు టీడీపీ గాలమేస్తోంది. అధికారపార్టీలోని ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకే ఓట్లేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు. అయినా గెలుపు కష్టంకాబట్టే ఇంకెవరైనా అసంతృప్త ఎంఎల్ఏలు ఉన్నారా అని వెదుకుతోంది.
ఇందులో భాగంగానే అసంతృప్తిగా ఉన్న కొందరు ఎంఎల్ఏలను గుర్తించి వాళ్ళకి భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇపుడు గనుక టీడీపీ గెలుపుకు సహకరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ అని హామీ ఇస్తోందట. అలాగే ఎన్నికలకు అయ్యే ఖర్చునంతా పార్టీయే పెట్టుకుంటుందనే బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. టికెట్ హామీ ఇచ్చి, ఖర్చంతా పార్టీయే భరిస్తుందని హామీ ఇస్తే ఎవరైనా టెంప్ట్ అయ్యే అవకాశం ఉందనేది టీడీపీ ప్లాన్.
వచ్చేఎన్నికల్లో తమకు టికెట్లు రాదని అనుమానంగా ఉన్న వైసీపీ ఎంఎల్ఏలకే టీడీపీ తరపున ఇలాంటి బంపరాఫర్ అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత జగన్ అసంతృప్త ఎంఎల్ఏలను పిలిపించుకుని మాట్లాడారట. కొందరు సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి నెల్లూరులోని ఇద్దరు ఎంఎల్ఏల మీదే అనుమానాలున్నాయనే ప్రచారం పెరిగిపోతోంది. మొత్తానికి ఫలితం ఎలాగుంటుందో కానీ గెలుపు ప్రయత్నాలు మాత్రం అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది.