హైదరాబాద్ : టీఎస్ పీఎస్పీ వివాదం రాజుకుంటోందా ?

Vijaya




టీఎస్ పీఎస్సీ వివాదం బాగా రాజుకునేట్లే ఉంది చూస్తుంటే. టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైనట్లు ఇపుడు బయటపడింది. ఈమధ్యనే నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలను కూడా బోర్డు రద్దుచేసింది. దీంతో పరీక్షలు రాసిన వేలాదిమంది నిరుద్యోగులు ఇటు బోర్డుపైన అటు కేసీయార్ ప్రభుత్వంపై మండిపోతున్నారు. ఇదే విషయమై నిరుద్యోగులు, పరీక్షలు రాసిన వాళ్ళు నానా రచ్చచేస్తున్నారు. వీళ్ళకు రాజకీయపార్టీలు తోడయ్యాయి.



తాజాగా గవర్నర్ ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిసినపుడు బోర్డును వెంటనే రద్దుచేయమని సూచించారు. అలాగే మంత్రి కేటీయార్ ను విచారించాలని సిట్ ను ఆదేశించాలని చెప్పారు. రేవంత్ కోరినట్లు గనుక గవర్నర్ తమిళిసై అడుగులు ముందుకేస్తే మళ్ళీ రాజ్ భవన్-ప్రగతిభవన్ మధ్య గొడవలు ఖాయం. కేసీయార్ మీద తమకున్న వ్యతిరేకతను కాంగ్రెస్, బీజేపీలు ఈ రూపంలో తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడే గవర్నర్, కేసీయార్ మధ్య సమస్య పెరిగిపోతోంది. 



అందుకు గవర్నర్ గనుక అవకాశమిస్తే మరో రాజ్యాంగసంక్షోభానికి కారకులయ్యే అవకాశముంది. అసలే గవర్నర్-కేసీయార్ మధ్య సంబంధాలు ఏమాత్రం బావోలేవని అందరికీ తెలిసిందే. అందుకనే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తే ఉన్నతాధికారుల బృందం సిట్ తో కేసీయార్ విచారణ చేయిస్తున్నారు.



ఈ దశలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు సిట్ స్ధానంలో సిట్టింగ్ జడ్జితో విచారణని, బోర్డును రద్దుచేసే విషయంలో కానీ గవర్నర్ నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులు. కాబట్టి గవర్నర్ కాస్త సంయమనం పాటించాల్సిన సమయమిది. రాష్ట్రానికి పెద్దదిక్కుగా ఉండాల్సిన గవర్నర్-కేసీయార్ మధ్య వివాదం రాష్ట్రానికి ఏమాత్రం మంచిదికాదు. ఇప్పటికే వీళ్ళ మధ్య వివాదం సుప్రింకోర్టుకెక్కింది. కాబట్టి మరో వివాదం రేగకుండా ఇద్దరు జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది. వివాదం మొదలుకాకూడదంటే ముందు కేసీయారే చొరవ చూపాలి తప్పదు. మరి కేసీయార్ ఆ పనిచేస్తారా ? చూద్దాం ఏమిచేస్తారో ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: