హైదరాబాద్ : వీళ్ళిద్దరిపైనా లీగల్ యాక్షన్ తప్పదా ?
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బాగా వివాదాస్పదమయ్యేట్లుంది. లీకేజీ వ్యవహారాలపై విచారణ చేస్తున్న సిట్ ఉన్నతాధికారులు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని ఆలోచిస్తోంది. ఎందుకంటే టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన ప్రశ్నపత్రాల లీకేజీపై రేవంత్, బండి చాలా ఆరోపణలు చేశారు. తాముచేసిన ఆరోపణలకు ఆధారాలను సమర్పించమని సిట్ వాళ్ళని విచారణకు పిలిచింది.
సిట్ విచారణలో ఆరోపణలకు సరైన ఆధారాలు ఇవ్వని కారణంగా రేవంత్ పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలని సిట్ రెడీ అవుతోంది. బండి స్పందన చూసి అవసరమైతే బీజేపీ చీఫ్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటోంది. ఇక్కడే సమస్యంతా వస్తోంది. రాజకీయంగా అనేకమంది అనేకులపై అనేక ఆరోపణలు చేస్తుంటారు. వాటిల్లో చాలావరకు నిరూపణ కాని ఆరోపణలే ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇపుడు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపైన ఆరోపణలు కూడా అలాంటివే అనుకోవాలి. ఇక్కడ విషయం ఏమిటంటే వీళ్ళిద్దరు సిట్ విచారణను మొదటినుండీ వ్యతిరేకిస్తున్నారు.
సిట్ బదులు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే తమ దగ్గరున్న ఆధారాలను ఇస్తామనే చెబుతున్నారు. వీళ్ళ డిమాండును ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకనే రేవంత్ సిట్ కు తన దగ్గరున్న ఆధారాలను ఇవ్వలేదేమో. అంతమాత్రాన రేవంత్ పై సిట్ లీగల్ యాక్షన్ ఎలా తీసుకుంటుందో అర్ధం కావటంలేదు. రేవంత్, బండికి కేటీయార్ కూడా లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు ప్రచారంలో ఉంది. కేటీయార్ లీగల్ నోటీసులు ఇస్తే వాటిని కచ్చితంగా వాళ్ళిద్దరు ఎదుర్కొంటారు. దీనితో సిట్ కు ఎలాంటి సంబంధంలేదు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.