పంజాబ్ : ఉద్యోగులకూ ఒంటిపూటేనా ?
మనదగ్గర కాదులేండి. పంజాబ్ లోని ప్రభుత్వ ఆఫీసులకు కూడా మే నెల నుండి ఒంటిపూట పనివిధానం అమలుచేయబోతున్నట్లు ముఖ్యమంత్రి భగవంగ్ సింగ్ మాన్ ప్రకటించారు. మామూలుగా ఎక్కడైనా పిల్లలకు ఒంటిపూట బడులు, కాలేజీలు నిర్వహించటం తెలిసిందే. కానీ ఉద్యోగులకు కూడా ఒంటిపూట పని అనేది వినూత్నంగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే విద్యుత్ వాడకాన్ని తగ్గించటం, ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పెరిగిపోతోండటమే. ఈ రెండింటికి తక్షణ పరిష్కారంగానే ముఖ్యమంత్రి ఒంటిపూట పనివిధానాన్ని అమలుచేయాలని డిసైడ్ చేశారు.
పంజాబ్ లో వేసవి ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పెరిగిపోతున్నాయట. వేడిని తట్టుకోలేక ఉద్యోగులందరు ఆఫీసుల్లో ఫ్యాన్లు, ఏసీలను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. దాంతో విద్యుత్ వాడకం కూడా బాగా పెరిగిపోతోంది. ఎప్పుడైతే విద్యుత్ వాడకం పెరిగిపోతోంది ఉత్పత్తి సరిపోక బయటనుండి కొనాల్సొస్తోంది. బయటనుండి విద్యుత్ ను కొనాలంటే వేల కోట్లరూపాయలు ఖర్చు చేయాల్సొస్తోంది. అంట అటుతిరిగి ఇటుతిరిగి ప్రభుత్వం మీద విద్యుత్ కొనుగోళ్ళ భారం బాగా పెరిగిపోతోంది.
వీటన్నింటినీ ఆలోచించే ఉద్యోగులకు కూడా ఒంటిపూట ఆఫీసులు పెట్టేస్తే విద్యుత్ వినియోగం తగ్గుతుందని సీఎం అనుకున్నారు. మే 2వ తేదీనుండి జూలై 15వ తేదీవరకు కొత్త పద్దతి అమల్లో ఉంటుందని మాన్ ప్రకటించారు. ఇపుడు ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలి. మే 2వ తేదీ నుండి అన్నీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 7.30కే మొదలై మధ్యాహ్నం 2 గంటలకు మూతపడతాయి.
ఉదయం ఎలాగూ 10 గంటలవరకు ఎండ తీవ్రత అంతగా ఉండదు. అంటే రెండున్నర గంటలపాటు ఏసీల అవసరం అంతగా ఉండదని అనుకుంటున్నారు. కొత్త నిర్ణయం వల్ల పంజాబ్ ఆఫీసుల్లో రోజుకు 300-350 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిపోతుందని అంచనా వేశారు. నిజంగా అంత విద్యుత్ వినియోగం తగ్గితే విద్యుత్ కొనుగోళ్ళ భారం కూడా చాలా తగ్గిపోతుందనటంలో సందేహంలేదు. పంజాబ్ ప్రయోగం సక్సెస్ అయితే మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. మంచి ఎక్కడ మొదలైనా మిగిలిన వాళ్ళు అనుసరించటం మంచిదే కదా.