అమరావతి : మోతెక్కిపోతున్న మిస్డ్ కాల్స్
జగనన్నే మా భవిష్యత్తు (జేఎంబీ) కార్యక్రమంలో మిస్డ్ కాల్స్ మోతెక్కిపోతోంది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసిన ఎన్నికల ప్రచారమనే అనుకోవాలి. ఇంత భారీఎత్తున పార్టీపరంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమం దేశంలో ఇదే మొదటిసారి. ప్రభుత్వం తరపున ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను పార్టీ శ్రేణుల ద్వారా కన్ఫర్మ్ చేసుకోవటం, క్రాస్ చెక్ చేసుకోవటమే కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యం.
మొన్నటి 7వ తేదీన మొదలైన కార్యక్రమం 20వ తేదీ వరకు నిరంతరాయంగా జరుగుతుంది. రాష్ట్రంలోని 1.6 కోట్ల ఇళ్ళల్లోని 5 కోట్ల జనాలను వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు సేకరించి, పథకాలు అందుతున్న విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ప్రజలు తమింటికి రమ్మని ఆహ్వానించాలని అనుకున్న వారు 82960 82960 మొబైల్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలని జగన్ ప్రకటించారు. ఆసక్తున్న జనాలు పై నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే తిరిగి హెల్ప్ లైన్ ద్వారా పార్టీ బాధ్యులే వచ్చిన నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటారు.
ఆ విధంగా తాము నోట్ చేసుకున్న ఇళ్ళకు వెళ్ళి పైన చెప్పిన వివరాలు మాట్లాడి, అభిప్రాయాలు తెలుసుకుంటారు. వాళ్ళ అనుమతి తీసుకుని ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు. జగన్ ఉద్దేశ్యం ఏమిటంటే స్టిక్కర్ అంటించటానికి అంగీకరించారు అంటే వాళ్ళంతా తన పాలనపట్ల సానుకూలంగా ఉన్నారని. సానుకూలంగా లేకపోయినా, వ్యతిరేకంగా ఉన్నా జగన్ స్టిక్కర్ అంటించటానికి అంగీకరించరని జగన్ అనుకుంటున్నారు.
కార్యక్రమం మొదలైన మూడురోజుల్లోనే సుమారు 22 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయట. అలాగే పార్టీ శ్రేణులు ఇప్పటికి 26 లక్షల ఇళ్ళని కవర్ చేసినట్లు సమాచారం. 10వ తేదీన వచ్చిన మిస్డ్ కాల్స్ సంఖ్య ఇంకా తెలీదు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం సగటున రోజుకు 7 లక్షల మిస్డ్ కాల్స్ వస్తున్నట్లు అర్ధమవుతోంది. మొత్తానికి ఇంత భారీ కార్యక్రమాన్ని డిజైన్ చేయటంలో జగన్ వ్యూహం వర్కవుటయ్యేట్లే ఉంది. మరి 20వ తేదీన కార్యక్రమం అయిపోతేకానీ పూర్తి వివరాలు తెలీవు.