ఉత్తరాంధ్ర : స్టీల్ ప్లాంట్ పై వెనకడుగు..జగన్ ఎఫెక్టేనా ?

Vijaya



విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రప్రభుత్వం నిలిపేసింది. ఇప్పట్లో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే ఉద్దేశ్యంలో  కేంద్రప్రభుత్వం లేదని ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. స్టీల్ ఫ్యాక్టరీని పరిశీలించే విషయమై మంత్రి వైజాగ్ చేరుకున్నారు. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ నేపధ్యంలోనే ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం నిలిపేసి, బలోపేతం చేయటంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. దీంతో దాదాపు 770 రోజులుగా ఉద్యమం చేస్తున్న ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు ఫుల్లు హ్యాపీ అయిపోయారు.



కొద్దినెలలుగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేది చేసేదే అని కేంద్రమంత్రులు పార్లమెంటులోనే పదేపదే ప్రకటించిన విషయం తెలిసిందే. స్టీల్స్ ను ప్రైవేటీకరించ వద్దని నరేంద్రమోడీకి  జగన్మోహన్ రెడ్డి లేఖరాసినా పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత కూడా ప్రైవేటీకరణ వైపే కేంద్రం మొగ్గుచూపింది. ఇప్పుడో అప్పుడో ఫ్యాక్టరీ ప్రైవేటు కంపెనీల చేతిలోకి వెళ్ళిపోవటం ఖాయమనే అందరు అనుకుంటున్నారు.



రాజకీయంగా ఏదైనా అనివార్యత ఎదురైతే తప్ప ప్రైవేటీకరణ నుండి మోడీ ప్రభుత్వం వెనక్కు తగ్గదని అనుకుంటున్నదే. సరిగ్గా ఈ నేపధ్యంలోనే ఉరుములేని పిడుగు లాగ ఫగ్గన్ సింగ్ వచ్చారు. ఫ్యాక్టరిని చూసిన తర్వాత మాట్లాడుతు ప్రైవేటీకరణను కేంద్రం ప్రస్తుతానికి నిలిపేసిందని చెప్పటాన్ని మొదట్లో ఎవరు నమ్మలేదు. మంత్రి రెండోసారి కూడా చెప్పిన తర్వాతే అందరు నమ్మారు.



అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈమధ్యనే జగన్ రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ఆ సందర్భంలో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయద్దని మోడీకి గట్టిగా చెప్పుంటారనే చర్చ మొదలైంది. ఎందుకంటే రెండుసార్లు మోడీని కలిసినపుడు స్టీల్ ఫ్యాక్టరీ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారని ప్రభుత్వం చెప్పింది. దాని ఫాలో అప్ గానే వైజాగ్ స్టీల్స్ పై మోడీ నిర్ణయం తీసుకున్నారా అనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయానికి తామే కారణమని తెలంగాణా మంత్రి కేటీయార్ క్రెడిట్ తీసుకున్నారు. మరి నిజమేమిటో మోడీ సర్కారే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: