అమరావతి : సిగ్గుపడాల్సింది రాహుల్, కేవీపీలేనా ?
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపా రామచంద్రరావు బాధేమిటో అర్ధంకావటంలేదు. ఎంపీగా రాహుల్ గాంధి అనర్హత వేటుపై ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేనలు స్పందించలేదట. అందుకనే మూడుపార్టీలను బీజేపీలో విలీనం చేసేయాలట. రాహుల్ ఎంపీ పదవిపై మాట్లాడని పార్టీలు ఇంకా బీజేపీలో ఎందుకు విలీనం కాలేదని కేవీపీ తెగ బాధిపడిపోయారు. ఇక్కడ కేవీపీ మరచిపోయిన విషయం ఏమిటంటే అసలు ఎంపీగా రాహుల్ గాంధి అనర్హత వేటుపై మాట్లాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు ఏముంది ?
కాంగ్రెస్ ఏమీ వైసీపీ, టీడీపీ, జనసేనకు మిత్రపక్షం కాదు. పోనీ యూపీఏతో కానీ లేదా నాన్ ఎన్డీయే పార్టీలతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయా అంటే అదీలేదు. జనసేన ఎలాగూ బీజేపీకి మిత్రపక్షమే కాబట్టి పవన్ స్పందించలేదు. చంద్రబాబుకు స్పందించాలని ఉన్నప్పటికీ నరేంద్రమోడీ భయం వల్ల మాట్లాడటంలేదేమో. ఇక జగన్ ఎలాగూ కేంద్రప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు కాబట్టి స్పందించరు. అదీకాక తనను కాంగ్రెస్ ఎంతగా వేధించింది జగన్ ఎలా మరచిపోగలరు ? ఎందుకు స్పందించలేదు అనేందుకు ఇంత స్పష్టంగా కారణం కనబడుతున్నా కేవీపీలో ఎందుకింత అక్కసు.
రాహుల్ విషయంలో స్పందించేవారు స్పందిస్తారు లేనివాళ్ళు లేదంతే. స్పందించటం, స్పందించకపోవటం ఎవరిష్టం వాళ్ళది. రాహుల్ విషయంలో ఏపీలోని ప్రజా ప్రతినిధులు స్పందించకపోవటం సిగ్గుచేటట. అంతగా సిగ్గుపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. పైగా రాహుల్ పై అనర్హత వేటుపడింది కూడా నోటిదురుసు వల్లే అని అందరికీ తెలుసు.
నరేంద్రమోడీ సెటైర్లు వేస్తున్నానని అనుకుని మోడీ ఇంటిపేరు కలవాళ్ళందరినీ అవమానించారు. దేశం వదిలి పారిపోతున్న ఆర్ధిక నేరగాళ్ళ ఇంటిపేరంతా మోడీ అనే ఎందుకుంటోందా అన్నారు. అందుకనే మోడీ ఇంటిపేరున్న పూర్ణేష్ మోడీ అనే బీజేపీ ఎంఎల్ఏకి మండింది. దాని ఫలితమే కోర్టులో పరువునష్టం కేసు, జైలుశిక్ష, అనర్హత వేటు. నోటికొచ్చింది మాట్లాడి అనర్హుడైనందుకు రాహుల్ సిగ్గుపడాలి. తమ నాయకుడు తప్పుచేసినా సమర్ధించుకుంటున్న కేవీపీ లాంటి వాళ్ళు సిగ్గుపడాలి. అంతేకానీ ఏపీ ప్రజాప్రతినిధులు సిగ్గుపడాల్సినంత అవసరం ఏమీలేదు.