రాయలసీమ : అవినాష్ కు ప్రత్యామ్నాయం తప్పదా ?
తాజా రాజకీయ పరిణామాల్లో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి తప్పదనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఇరుక్కున్న విషయం తెలిసిందే. వివేకా హత్యలో తండ్రీ, కొడుకులదే కీలకపాత్రని సీబీఐ పదేపదే వాదిస్తోంది. అయితే అందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపలేకపోతోంది. సీబీఐ దగ్గరున్న ఒకే ఒక ఆధారం ఏమిటంటే గుగుల్ టేకౌట్ అనే సాంకేతికత.
హత్యలో పాల్గొన్న వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు హత్య జరిగిన సమయంలో ఎంపీ ఇంట్లోనే ఉన్నట్లు గుగుల్ టేకౌట్ ద్వారా మొబైల్ లొకేషన్ను సీబీఐ కనిపెట్టింది. కాబట్టి హత్యలో ఎంపీకి కూడా భాగస్వామ్యముందని సీబీఐ వాదిస్తోంది. అయితే టేకౌట్ ను సరైన ఆధారంగా చూడలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆధారాల విషయం ఎలాగున్నా ఇప్పటికే భాస్కరరెడ్డి అరెస్టయ్యారు. అవినాష్ ను కూడా అరెస్టుచేయటానికి సీబీఐ రెడీగా ఉంది. కేసులో అంతిమ తీర్పు ఎలాగుంటుందో తెలీదుకానీ ఇప్పటికైతే అధికారపార్టీకి ముఖ్యంగా జగన్ కు చికాకులు మొదలయ్యాయనే చెప్పాలి.
మరోవైపు ఎన్నికల వేడి పెరిగిపోతోంది. 175కి 175 సీట్ల టార్గెట్ పెట్టుకున్న జగన్ను ఇలాంటి చికాకులు ఇబ్బంది పెడుతోంది. ఇందులో భాగంగానే కడపకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకోవాల్సిన అవసరం జగన్ కుంది. ఎందుకంటే ఇప్పటివరకు జిల్లా మొత్తాన్ని అవినాష్ పర్యవేక్షిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా జగన్ దాకా వెళ్ళకుండా తానే సర్దుబాబు చేస్తున్నారు. జిల్లాలో అవినాష్ తిరుగులేని నేతగా చెలామణి అవుతున్నారు.
అలాంటి అవినాష్ పై హత్యారోపణలు, విచారణలు పెద్ద ఇబ్బందిగా మారాయి. రేపు అరెస్టయితే సమస్య మరింతగా పెరిగిపోతోంది. అందుకనే ముందుజాగ్రత్తగా అవినాష్ కు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. జగన్ ఇపుడు ఈ విషయంపైనే ఆలోచిస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తాన్ని పర్యవేక్షించగలిగిన సమర్ధులైన నేతల గురించి ఆలోచిస్తున్నారట. తొందరలోనే ఈ విషయమై జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితులు వచ్చాయి. అదేదో వీలైనంత తొందరగా తీసుకుంటే జిల్లా పార్టీలో గ్యాప్ రాకుండా ఉంటుందని అనుకుంటున్నారని సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.