హైదరాబాద్ : షమీమ్ ఆరోపణలను షర్మిల కన్ఫర్మ్ చేశారా ?
ఎందుకు చెప్పారో తెలీదుకానీ వివేకానందరెడ్డి హత్యపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు రెండో భార్య షమీమ్ చేస్తున్న ఆరోపణలు నిజమే అని ధృవీకరించినట్లుంది. షర్మిల ఏమి చెప్పారంటే ఆస్తుల కోసం తమ చిన్నాన్న హత్య జరగలేదట. ఎందుకంటే ఆస్తులన్నింటినీ చిన్నాన్న ఎప్పుడో కూతురు సునీత పైన రాసేశారట. అలాగే ఆస్తులన్నింటినీ సునీతకే చెందేట్లు వీలునామా కూడా రాశారని షర్మిల చెప్పారు. చిన్నాన్నపైన పెద్దగా ఆస్తులు లేవని ఏవో చిన్నా చితకా మాత్రమే ఉందన్నట్లుగా చెప్పారు.
చనిపోయిన వ్యక్తిమీద వ్యక్తిత్వ హననం జరిగేట్లుగా మీడియా వార్తలు రాయటం ఏమిటంటే మండిపోయారు. సమాధానం చెప్పుకునే అవకాశంలేని తన చిన్నాన్నపై తప్పుడు వార్తలు రాయద్దని హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ వివేకా వ్యక్తిత్వ హనానికి ఎవరు పాల్పడ్డారు ? వివేకాకు రెండో భార్య ఉందని, వాళ్ళకి కొడుకు పుట్టాడని హత్య తర్వాత లోకానికి తెలిసింది. ఇది వ్యక్తిత్వహననం ఎలాగవుతుంది ? తన తల్లిని వివేకానందరెడ్డి లైంగికంగా వేధించాడని హత్యకేసు నిందితుల్లో ఒకడైన సునీల్ యాదవ్ ఆరోపించాడు.
ఇక ఆస్తులు, వీలునామా విషయాన్ని చూస్తే కొద్దిరోజులుగా షమీమ్ చేస్తున్న ఆరోపణలను షర్మిల కన్ఫర్మ్ చేస్తున్నట్లే ఉంది. ఆస్తులకోసమే కూతురు, అల్లుడితో వివేకాకు గొడవలయ్యాయని షమీమ్ ఆరోపిస్తున్నారు. తమ కొడుకుపైన ఆస్తులను రాయాలని, కొడుకును వారసుడిగా ప్రకటించాలని, వీలునామాను తిరిగిరాయాలని వివేకా అనుకుంటే దాన్ని కూతురు, అల్లుడు అడ్డుకున్నారని షమీమ్ చెప్పారు.
వీలునామా రాసినా, రెండోభార్య కొడుకును వారసుడిగా ప్రకటించినా, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసినా నష్టపోయేది సునీత, ఆమె భర్తే అని షర్మిల చెప్పకనే చెప్పినట్లయ్యింది. తమ చేతిలోని ఆస్తులు ఎక్కడ జారిపోతాయో అనే టెన్షన్ కూతురు, అల్లుడిలో పెరిగిపోయిందేమో. వివేకా తర్వాత ఆస్తులన్నింటికీ ఏకైక వారసురాలిగా కూతురు మాత్రమే ఉన్నారు. అదే వివేకా ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి, వీలునామా తిరగరాస్తే ఆస్తులకు రెండోభార్య కొడుకు కూడా భాగస్తుడవుతాడు. అందుకని ఆస్తులు, వీలునామా, వారసుడి ప్రకటన విషయంలోనే వివేకాతో కూతురు, అల్లుడు గొడవ పడ్డారని షమీమ్ చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. షమీమ్ చెబుతున్నది, షర్మిల చెప్పింది వింటే వివేకా హత్యలో కూతురు, అల్లుడి ప్రమేయమన్నమాట నిజమే అనిపిస్తుంది. మరి కోర్టు ఏమి తేలుస్తుందో చూడాలి.