అమరావతి : చంద్రబాబు-పవన్ సడెన్ భేటీ...ఏం జరుగుతోంది ?
ఎన్టీయార్ శతజయంతుత్సవాల పేరుతో రజనీకాంత్ తో శుక్రవారం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. సరే ఆ భేటీకి ఏదో కారణం ఉందని అనుకోవచ్చు. మరి శనివారం హఠాత్తుగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో కూడా భేటీ అయ్యారు. మరి వీళ్ళభేటీ ఎందుకు జరిగినట్లు ? రజనీతో చంద్రబాబు భేటీ అయిన కారణం అందరికీ తెలిసిందే. భేటీలో వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు తెలియకపోవచ్చు. మరి చంద్రబాబు, పవన్ భేటీ ఎందుకు జరిగినట్లు ?
భేటీనే ఎందుకు జరిగిందో తెలీకపోతే ఇక భేటీలో ఏమి మాట్లాడుకున్నారో ఎలా తెలుస్తుంది ? మాజీమంత్రి కొడాలి నాని చెప్పినదాని ప్రకారం రజనీకాంత్ ను బూచిగా చూపించి పవన్ను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ప్రచారం కోసం తప్ప చంద్రబాబుకు పవన్ ఇంకదేనికీ ఉపయోగపడరట. కాబట్టి ప్రచారం కోసం సినీ గ్లామర్ కోసం పవన్ కాకపోతే చంద్రబాబుకు రజనీకాంత్ ఉన్నారని కొడాలి చెప్పారు.
ప్రచారం కోసమే అయితే రజనీ వచ్చినా టీడీపీకి పెద్దగా ఉపయోగముండదు. పవన్ వల్ల చంద్రబాబుకు ఉపయోగం ఏమిటంటే టీడీపీకి కాపుల ఓట్లు పడటం. జనసేనతో పొత్తుపెట్టుకుంటే టీడీపీకి కాపుల ఓట్లు బదిలీ అవుతాయని చంద్రబాబు అనుకుంటున్నారు. నిజంగానే కాపుల ఓట్లు టీడీపీకి పడతాయా ? పడవా అన్నది ఎన్నికల్లో కానీ తెలీదు.
మరిపుడు తాజా భేటీలో మహాయితే పొత్తుల గురించే మాట్లాడుకునుండాలి. పొత్తు పెట్టుకుంటే ఎన్నిసీట్లు జనసేనకు ఇస్తారు ? ఏ నియోజకవర్గాలు ఇస్తారనే విషయమే చర్చించుకునేందుకు అవకాశముంది. ఇదే సమయంలో బీజేపీని వదిలేసి ఎలా రావాలనే విషయంపైన కూడా మాట్లాడుకునే అవకాశముంది. బీజేపీతో పొత్తుకు పవన్ పైన చంద్రబాబు భారం మోపినా ఉపయోగంలేకపోయిందట. అందుకనే కింకర్తవ్యం ఏమిటనే విషయమై చర్చించుకునేందుకే భేటీ అయ్యుంటారు. ఏదేమైనా తొందరలోనే మూడుపార్టీల మధ్య ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.